పుట:2015.373190.Athma-Charitramu.pdf/624

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 584

నెల్లూరుమండలమున గాలివానకు నిస్సహాయు లయిన పిల్లలను సంరక్షించుటకై శరణాలయ మొకటి స్థాపింప నెంచి, మిత్రులము కొందఱము ఇసకా చెంచయ్య, జానకీబాయిగార్ల ద్వారా ధర్మ సంస్థ నొకటి యారంభించితిమి. పాప మీ యిసకాదంపతులు శ్రమ యనక, దిక్కులేని పసిపిల్లలకు భోజనాదిసౌకర్యము లొనఁగూర్చిరి. అంత నీసంస్థ నుద్ధరింప పురప్రముఖు లొక సమాజముక్రింద నేర్పడిరి.

6 వ డిసెంబరున ఆంధ్రవిశ్వవిద్యాలయసభ సమావేశమై, పరీక్ష నిచ్చినవారలకు పట్టము లొసంగిరి. శ్రీ గవర్నరుగా రధ్యక్షులు. శ్రీ రఘుపతి వెంకటరత్నమునాయఁడుగారికి డాక్టరుబిరుదము నొసఁగుఁడని బందరు నోబిలుకళాశాలాధ్యక్షుఁడు జానుస్టను దొర యాంగ్లమునను, వేదము వెంకటరాయశాస్త్రులుగారికి "కళాప్రపూర్ణ" అను బిరుద మీయుఁడని యాంధ్రమున నేనును ఆసమయమున నుపన్యాసములు చేసితిమి.

ఆ డిశెంబరునెలలో నేనును కొందఱు నెల్లూరుమిత్రులును, మేము నూతనముగ నెలకొల్పిన శరణాలయములో దీనబాలురను బాలికలను జేర్పించుటకై చుట్టుపట్టుల గ్రామములకుఁ బోయివచ్చితిమి. ఇట్లు శరణాలయమున సుమా రిరువదిపిల్లలు చేరిరి.

డిశెంబరు చివరభాగమున మద్రాసులో దేశీయమహాసభ జరిగెను. దీనితోఁబాటు సంఘసంస్కరణసభలు మున్నగునవికూడ జరిగెను. నేను భార్యయు, తమ్ముఁడు వెంకటరామయ్య, మఱఁదలు శ్యామలాంబయు చెన్నపురి పోయితిమి. దేశీయసభలో సభ్యురాలగు చామాలమ్మ కొకకుటీర మీయఁబడెను. అందు మేము వంటచేసికొని భుజించి నివసించితిమి. కాంగ్రెసులో సంపూర్ణస్వాతంత్ర్యమును గుఱించిన తీర్మాన మామోదింపఁబడెను.