పుట:2015.373190.Athma-Charitramu.pdf/611

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26. శుభాశుభములు 571

కొని వచ్చెను. అచటఁ గొన్నిదినము లుంచి, మే మామె నంత చెన్నపురికిఁ దీసికొనిపోయి, రాజధానీవైద్యాలయమున నుంచి, మాల్కముసను వైద్యునిచే మం దిప్పించితిమి. ఆ పురమున నొకనెల యుండిన పిమ్మట, కొంత స్వస్థపడిన తన సతిని మా తమ్ముఁడు భీమవరము తరలించెను.

నేను జిరకాలముక్రిందట ఓరియంటలు భీమాకంపెనీలో భీమా చేయించిన యొక పాలిసీసొమ్ము వేయి రూపాయిలు నా కీ యాగష్టునెలలో వచ్చెను. ఇంతకాలము నేను జీవింతు ననియు, జీవితకాలములోనే నే నీ పైక మందుకొనుభాగ్యము గాంతు ననియును, భీమా చేసిన ముప్పది సంవత్సరములక్రిందట నేను గలనైన ననుకొన లేదు ! ముప్పది సంవత్సరముల క్రిందటికంటె నేమి కారణముననో నే నిటీవలనే మంచి దేహారోగ్యము గాంచియుంటిని. దేహారోగ్య మెటులుండినను, ఆర్థికవిషయమున వెనుకటికంటె నిపుడు నాపరిస్థితులు బాగుగ నుండెను.

కొంతకాలము క్రిందటినుండి నెల్లూరు మండల వైద్యాధికారిగ నుండి, నా కనేకసందర్భములందు సాయపడి, మా యింటనే జరుగుచుండు "ప్రార్థనసమాజ" సభలలో ప్రాముఖ్యము వహించి, న్యాయమూర్తియు ధర్మశీలుఁడు నని నెల్లూరుమండల వాస్తవ్యులచేఁ బొగడ్తల నందిన కెప్టెను యస్. కె. పిళ్లగారిపుడు బదిలీయై వెడలిపోవు సందర్భమున, వారి, గౌరవార్థమై యీ యాగష్టునెలలో మా యింట నొక విందు గావించి, ఆయనయందు నాకుఁ గల భక్తి ప్రేమములను గొంత వెలిపుచ్చితిని.

ఈ దసరా సమయమున జరిగిన ఇంటరుమీడియేటు విశ్వవిద్యాలయపుఁబరీక్షలో నా కెంతో తోడుపడి, చిరకాల మీ