పుట:2015.373190.Athma-Charitramu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. రాజమహేంద్రవరము 23

కుఱ్ఱవాండ్రము సణుగుకొనుచుండెడివారము. మారెండవ పెద్దతండ్రి కుమాళ్లు, తలిదండ్రులను లెక్కసేయక, మాముందే స్వేచ్ఛావిహారములు సలుపుచుండుటకు మా కనులు మఱింత కుట్టెను.

గృహపాలనమున మాజనని పూనిన కఠినపద్ధతివలనఁ గొంత చెఱుపు కలిగె నని చెప్పక తప్పదు. తిరిగెడి కాలునకును చూచెడి కనులకును అడ్డంకి కలిగినచో, దేహమనశ్శక్తులు గిడసఁబారు ననవచ్చును. కూపస్థమండూకములవలె నిరతము నింటి నంటిపెట్టుకొనుటచే, తోడి బాలురకుండు గడుసుఁదనము లేక మేము లోకజ్ఞానవిషయమునఁ గొంతవఱకు వెనుకఁబడి యుంటిమి.

ఐనను, తల్లి యదుపులో నుండుటచే మొత్తముమీఁద మాకు మేలే చేకూరెను. ఆయిల్లాలిమాట జవదాటకుండుట వలననే, క్రొత్త ప్రదేశమందలి దుశ్శోధనములకును దురభ్యాసములకును మేము లోను గాకుండుటయు, మంచినియమములు కొన్ని మేము బాల్యమందె నేర్చుకొనుటయును సంభవించెను. రాజమంద్రి వచ్చిన క్రొత్తఱికమున మాతమ్ముఁడు వెంకటరామయ్య బడికిఁబోవుటయందుఁ గొంత కొంటె తన మగఁబఱచెను. ఇంటినుండి వాఁడు నాతో బయలుదేఱినను కొంతదూరము వచ్చినపిమ్మట మెల్లగ వెనుకఁబడి, ఏసందుగొందులలోనో దాగియుండి, నేను బడినుండి మరలి వచ్చు సమయమున ముందుగ నడుగు లిడి యిలు సేరుచుండును ! నావిద్యాధోరణినే యుండిన నే నీసంగతి కొన్ని దినములవఱకును గమనింపక, పిమ్మట వానిమీఁద ననుమానము కలిగి, వానితరగతివారి నడిగి వాని టక్కరితనము తెలిసికొని, ఈసమాచారము మాయమ్మ కొకనాఁడు చెప్పివేసితిని. అపు డామె పెరుగు చిలుకుచుండెను. మాతమ్ము నంతట ప్రశ్నించి, తగినసమాధానము వాఁ డీయ నేరకుండుటచేత, కవ్వపుఁ