పుట:2015.373190.Athma-Charitramu.pdf/578

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 534

వెడలిపోయెను. ఇపుడు నే నింట నొక్కఁడనే యుంటిని. నరసింహము సూర్యనారాయణ రామచంద్రరావులు విద్యాధోరణినుండునట్టిపిల్లలు ! నామనస్సును వేధించు దు:ఖము వారి కేమి తెలియును ?

ఆగష్టు 4 వ తేదీని మిగిలిన సొమ్మిచ్చి, సుందరరామయ్య గారిచే నేను దస్తావేజు రిజిష్టరి చేయించుకొంటిని. ఇపుడు నాస్థలము కొలిపించి, దానికి దిమ్మెలు వేయించి, పలుమా రా ప్రదేశమును జూచుటకై బ్రాడీపేట పోయి వచ్చుచుండువాఁడను. నా మనస్సున కిపు డేర్పడిన నూతనాకర్షములలో నిదియొకటి.

ఇంతలో దేశమున రాజకీయపరిస్థితులు తీవ్ర మయ్యెను. బిసంటమ్మగారికి విధించిన శిక్షకొఱకు సర్. యస్. సుబ్రహ్మణ్యయ్యరుగారు దొరతనమువారిమీఁద నలిగి, తమకు వా రదివఱ కొసఁగిన గౌరవపట్టమును వారి కంపివేసిరి. దేశనాయకులలోఁ బలువురు ప్రభుత్వమువారిని నిరసించిరి. ఇట్టివారిలో వెంకటప్పయ్య గారొకరు. వీరికిఁగూడ నిట్టిశిక్షయె గలుగునని మిత్రుల మనుకొను చుండువారము.

సెప్టెంబరు 20 వ తేదీని నాకు వచ్చిన యుత్తరములో మాయత్తగారు ధవళేశ్వరమునఁ జనిపోయిరని యుండెను ! నెల క్రిందట నేను మామామగారిని జూచుటకు వెలిచేరు వెళ్లియుండినపుడు, భర్తకుఁ బరిచర్యలు చేయుచు నామె యచటనే యుండెను. ఇపుడు మామామగారికిఁ గొంచెము శరీరమున నెమ్మదిగనుండెను గాని, కొలఁదిరోజుల క్రిందటనె యాయనతల్లి కట్టుంగలోఁ జనిపోయెను. ఒక నెలలోనె యత్త కోడండ్రు పరలోకప్రాప్తిఁ జెందిరి. శాంతమూర్తియగు మాయత్తగారి యాకస్మికమరణమునకు విషాదమందితిని.