పుట:2015.373190.Athma-Charitramu.pdf/531

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. చెల్లెలి మరణము 489

మాత్రము మాయమ్మమ్మను అంధత్వబధిరత్వములు బాధించెను. మా తల్లి చనిపోయినపిమ్మట నీ యిల్లాలికి దు:ఖ మధికమై, ఆమెను జూచుటకు మనుమల మెవరమైన వేలివెన్ను వెళ్లునపుడు, మమ్ముఁ జేరఁబిలిచి, "నాయనా ! నీవు చాలాచదువుకొన్నావు. నాకు చావేలాగున వచ్చునోచెప్పవా ?" యని యాదీన యడిగి, కంట నీరుపెట్టుకొనియెడిది. శాంతమూర్తియు, సుస్వభావయునగు నీ సుదతి మనుమలమగు మమ్ము ప్రాణతుల్యులగఁ జూచుకొనియెడిది.

ఆసంవత్సరము సెప్టెంబరునెలలో మాచిన్న చెల్లెలు కామేశ్వరమ్మ పురుడుపోసికొనుటకు గుంటూరు వచ్చెను. వెనుక సన్నిపాత జ్వరము వచ్చినప్పటినుండియు కొంత చిక్కియుండినను, ఈసమయమున నామె సామాన్యారోగ్యము గలిగియెయుండెను. అక్టోబరు తుది రోజులలో కామేశ్వరమ్మకుఁ గొంచెము జ్వరమువచ్చెను. జ్వరములోనే నొప్పులు ప్రారంభమయ్యెను. ఆమె ప్రసవ మగుట దుస్తర మని తోఁచఁగనే, 30 వ తేదీ రాత్రి వైద్యురాలగు కుగ్లరు దొరసానిని బిలువఁగా, రోగి నామె తనవైద్యాలయమునకుఁ గొనిపోయెను. ఒక గంటలోనే కామేశ్వరమ్మ ప్రసవమయ్యెను. ఎన్ని సాధనములు చేసిన పిమ్మటనోగాని యపుడు జనించిన శిశు నేడువలేదు. పిల్లవానిమాట యెటు లుండినను, తల్లినిగుఱించి భయపడ నక్కఱలేదని దొరసాని చెప్పెను. కాని, యొకరోజులోనే పరిస్థితులు తాఱుమాఱయ్యెను. 31 వ తేదీని మధ్యాహ్నమున మాచెల్లెలికిఁ జాల జబ్బుచేసెనని మా కింటికి వర్తమానము వచ్చెను. మే మందఱమును పోయి చూచితిమి. రోగి స్పృహలేక పడియుండి, వేదనపడుచు, రాత్రి పదిగంటలకు కాలధర్మము నొందెను.