పుట:2015.373190.Athma-Charitramu.pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. ఉద్యోగప్రయత్నములు 483

వరితోను, ముఖ్యముగ నధ్యక్షునితోను, తగవులు పెట్టుకొనువాఁడను గాను. సామాన్యముగ నిట్టి తటస్థభావ మవలంబించియె నేను మనశ్శాంతి ననుభవించుచుండువాఁడను.

నాచెల్లెండ్రు కనకమ్మ కామేశ్వరమ్మలు గుంటూరువచ్చి, నాయొద్దఁ గొంతకాలము నివసించి వెడలిపోయిరి. ఇటీవలనే కామేశ్వరమ్మకు విశ్వనాధ మను పుత్రుఁడును, కనకమ్మకు జనార్దనమను పిల్లవాఁడును గలిగిరి. ఇదివఱకు కనకమ్మకు నరసయ్య సీతమ్మలను కొమార్తెలు గలరు.

1908 వ సంవత్సరము డిసెంబరునెలలో చెన్నపురిని దేశీయ మహాసభ జరిగెను. నే నచటికిఁ బోలేదు. తమ్ముఁడు వెంకటరామయ్య ఆనెలచివరను గుంటూరువచ్చి, తన వైద్యమునకు మద్రాసు నన్ను రమ్మనఁగా, మే మిరువురము నచటికి వెళ్లి, కొన్ని దినములుండి, మరలి వచ్చితిమి. చెన్నపురి వైద్యమువలన నతని కేమియు మేలు కలుగ లేదు. తనకు లేనిపోని జబ్బు లున్నవని యాతఁ డనుమానపడుచుండునట్లు తోఁచెను.

1909 వ సంవత్సర ప్రారంభమున గుంటూరులో దేవగుప్తాపు శేషాచలపతిరావుగారియింట జరిగిన వితంతు వివాహమునకు మేము దంపతులము పోయి తాంబూలము స్వీకరింపఁగా, పొరుగున నుండిన పూర్వాచారపరుఁడగు న్యాయవాదియొకఁడు మాయింటి కెవ్వరును భోజనమునకు రాకుండఁజేయఁ బ్రయత్నించెను. కాని, మాయింట జరిగిన యొక శుభకార్యసందర్భమున ననేకులు వచ్చి భుజించిరి. ఆన్యాయవాదియు, ననుచరులును తమపంతము నెగ్గకుండుటకు విషాదమందిరి.