పుట:2015.373190.Athma-Charitramu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము


రాత్రి భోజనానంతరమున నొక్కకప్పుడు, మా పెదతండ్రిగారి కుటుంబమును మేమును నొకచోటఁ జేరి, తంపట పెట్టినతేగలో, ఆనపకాయలో తినుచు, ఉబుసుపోకకు లోకాభిరామాయణము చెప్పుకొనుచుందుము. మా పెత్తండ్రి మిగుల పొట్టిగను చూచుటకుఁ గొంత భయంకరముగను నుండినను, కుటుంబసంభాషణములం దమితచతురతను బ్రదర్శించుచుండువాఁడు. ఆయన హాస్యోక్తులు పిల్లలకు పెద్దలకును మిక్కిలి నవ్వు పుట్టించెడివి. మా కుటుంబపూర్వచరిత్ర మాయన కన్నులార చూచినట్టుగ వర్ణించి చెప్పుచుండువాఁడు. మా తండ్రి, తాను ఉద్యోగకార్యములలోఁ దిరిగిన వివిధాంధ్రమండలముల యాచారసమాచారములును, అచటి తన యనుభవములును వివరింపుచుండువాఁడు. పిల్లల మగు మాకుఁ దోఁచిన వ్యాఖ్యలు మేమును జేయుచుండెడివారము. సత్యకాలపు ముతైదువయగు మాపెత్తల్లి యచ్చమ్మ, ఏ వెఱ్ఱిమొఱ్ఱి ప్రశ్న వేసియో, చేతకాని పని చేయఁజూచియో, అందఱి పరియాచకములకుఁ బాత్ర యగుచుండును.

ఒకటి రెండు సంవత్సరములలో మా రెండవపెత్తండ్రి, మూడవపెత్తండ్రియు రేలంగి చేరిరి. వీరిలో మొదటివారగు వెంకటరత్నముగారు మాపూర్వుల నివాసస్థల మగు గోటేరులో నింతకాలము నుండి, యిపు డచట నొంటరిగ నుండలేక రేలంగి వచ్చిరి. ఉపాధ్యాయుఁడుగ నుండిన పద్మరాజుగారు తాను జిరకాలము నివసించిన దేవరపల్లి విడిచి, సోదరులతోఁ గలసి యుండుటకై రేలంగి ప్రవేశించెను. అందువలన పూర్వపుపెంకుటిల్లు మూఁడు చీలికలై మా మువ్వురు పెత్తండ్రులకు నిపుడు నివాసస్థల మయ్యెను. మా జనకుఁడు నిర్మించిన పర్ణకుటీరమున మేము కాపుర ముంటిమి.