పుట:2015.373190.Athma-Charitramu.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 458

ధనకార్యము పూర్తి పఱుచుకొని, నేను పుస్తకాగారమున పీఠమువేసి కూర్చుండువాఁడను. నా కన్నుల కిదివఱకుఁ గానరాని పుస్తకములందుఁ బెక్కులు గలవు. అందలి విశేషములు గ్రోలుచుండుటయే నాకు ముఖ్యకాలక్షేపము. అచ్చటనుండి నాకుఁ గావలసిన పుస్తకములు గృహమునకుఁ గొనివచ్చి, అవి ముందువేసికొని యింటఁ గూర్చుండువాఁడను. ఈ క్రొత్తప్రదేశమున నా కెక్కువమంది పరిచితులు గా కుండుటయుఁ గూడ నాజ్ఞానాభివృద్ధికి మఱింత సహకారి యయ్యెను.

ఇట్లు, నాకు జ్ఞానసంపాద్యవిషయమునను, బోధానాసౌకర్యము లొనఁగూడుపట్లను ఇదివఱకుఁ జూచిన ప్రదేశము లన్నిటి కంటెను విజయనగరమె యుత్తమముగ నుండినను, మఱియొక విధమున నది యతినికృష్టమయ్యెను. ఇక్కడ దోమలబాధ విశేషము. సాయంకాలము చీఁకటిపడుటయే తడవుగ దోమలు తేనె టీగలవలె జుంజుమ్మని మూఁగుచుండును. పట్టణమునకును రెయిలుస్టేషనుకును మధ్య నుండు పెద్దచెఱువు దోమలకుఁ బుట్టినిల్లు. పురమునందలిముఱికి కాలువలు వానికి రచ్చపట్టులు. ఏమాత్ర మలుకుడైనను నిద్రాభంగ మందుట నైజమైన నాకు, విజయనగరమున నొక్కొక్కప్పుడు రాత్రులు జాగారమే ప్రాప్తించుచు వచ్చెను. దోమతెర యీపురుగుల కడ్డముగాదు. తెరలోనుండి యెటులో లోనికిఁ దూఱినయొకటి రెండు దోమలు, తెల్లవాఱువఱకును సంగీతము వినిపించుచునే యుండును. ఇచటి దోమలు, నిద్రాసక్తులగు వారికి రాత్రి నిరతము చెవులలో మేలుకొలుపులు పాడుచు, ముక్కు పుటములలో నాట్యములు సల్పుచు, అఱికాళ్లకు గిలిగింతలు పెట్టుచు నుండును. ఈపీడనుండి తప్పించుకొన నాకు తెఱువు వెఱవులు గానఁబడ కుండెను.