పుట:2015.373190.Athma-Charitramu.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. క్రొత్తప్రదేశము 439

నాయఁడుగారు నా కాదినములలో వ్రాసినయుత్తర మిందు ప్రచురించుచున్నాఁడను : -

మహబూబు విద్యాలయము

సికిందరాబాదు

22 - 4 - 1902

"భాతృవరా !

  • * * పరలోకప్రాప్తిఁజెందిన సోదరుని యకాలమరణము, జీవించియున్న మనబోంట్లకు హృదయనిర్భేదకము. కొఱగాని బ్రతుకు ప్రమిద యడుగువఱకును గాలువత్తివలె చిరకాల ముండును. పవిత్రాత్ములు మాత్రము ముందు వెడలిపోయెదరు. ఇట్లు తలంచుకొన్ననే మనము కొంత యుపశమనము గాంతుము. లేకున్న, లోకమంతయు నయోమయమును, హృదయము తాప పరిపీడితమును నగును. ఒకకంట నీరు విడుచుచునే, మనము విశ్వాసమునఁ బాటుపడుచు, దైవముమీఁద భారమువేసి, ధైర్యమున పనులు నెరవేర్చు కొనవలయును.

"మీకు లభించిన పరీక్షాధికారి పదవి తొలఁగిపోయె నని వింటిని. మీ కారోగ్యము సరిగా నున్నచో, దీనికై నాకంతగ విచారము లేదు. మీజీవితధర్మము బాలురకు ప్రబోధము కలిగించుటయే కాని, పరీక్షించుట కాదని మీరు ఊరడిల్లవలయును. మీకు వలసిన శక్తి సౌభాగ్యములు పరమేశ్వరుఁ డొసంగుఁగాక !

"బుచ్చయ్యపంతులుగారిని గుఱించి మీరు "సంఘసంస్కారిణీ" పత్రికకు వ్రాసిన వ్యాసము మద్రాసు బ్రాహ్మసామాజకులలోఁగొందఱికిఁ గడుపుమంట కలిగించెను. కాని మీవ్రాఁత సత్యమునకు దూరముగా దని నావిశ్వాసము.