పుట:2015.373190.Athma-Charitramu.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. పర్లాకిమిడిలో ప్రథమదినము 435

పూఁటలును నే నీవిహారనిమగ్నుఁడనై యుండు వాఁడను. ఐన నా వాహ్యాళి చీఁకటి పడకుండఁగనే పరిసమాప్తి కావలయును ! పట్టణమున కన్ని ప్రక్కలను నడవులు గలవు. ఒక దిక్కున చిఱుతపులులును, ఒక ప్రక్క నడవిపందులును, వేఱొకదిశ నెలుగుగొడ్లును గ్రుమ్మరుచుండు నని వదంతి ! అన్నివైపులను సర్పములు సమృద్ధి !

నేను వచ్చిన యొకనెలకు బ్రాహ్మసామాజికులగు చండీచరణుసేనుగారు బంగాళమునుండి వచ్చిరి. 7 వ మార్చిని జరిగిన బహిరంగ సభలో "ప్రజలఋణము తీర్చు టెట్లు?" అను విషయమును గుఱించి సేనుగారు ప్రసంగించిరి. సభకు నే నగ్రాసనాధిపతిని. రాజావారి తమ్ములు వచ్చి యుండిరి. ఇదివఱకే వారిని కోటలో సందర్శించితిని. నాలుగు దినముల పిమ్మట సేనుగారు వెడలిపోయిరి.

ఇటీవల మద్రాసువెళ్లినపుడు, వీరేశలింగముగారితో సంభాషణ సందర్భమున వారి జీవితకథ నాంగ్లమున వ్రాయుదునని నేనంటిని. దీని కొకవిధమున వారు సమ్మతించిరి. తాము 'స్వీయచరిత్రము' వ్రాయుటయుక్తమాయని వారడుగఁగా, అదిమంచిదనిచెప్పి, నేను వారినిఁ బ్రోత్సహించితిని. ఆపుస్తకమున ముద్రింపఁబడిన కాగితము లెప్పటివప్పుడు నాకు వారు పంపెదమనిరి. వారి జీవితచరిత్ర మిట్లు రెండువిధముల వేగమే ప్రచురింపఁబడఁగలదని నేను సంతసించితిని. కాని, క్రొత్తప్రదేశమండలి కార్యకలాపము వలన నాకంతగ తీఱిక లేకపోయినను, ఏప్రిలు "జనానాపత్రిక" లోను, "సంఘసంస్కారిణీ" పత్రికయందును నేను పంతులుగారి చరిత్రమును నాంగ్లమున రచింతునని ప్రకటించి, అవ్విధముననైన నాగ్రంథప్రారంభము కాఁగలదని యాశించితిని.