పుట:2015.373190.Athma-Charitramu.pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

431


ఆత్మ చరిత్రము

తృతీయభాగము : ఉపన్యాసకదశ

1. పర్లాకిమిడిలో ప్రథమదినములు

1902 వ సవత్సరము ఫిబ్రవరి ప్రారంభమున నేను పర్లాకిమిడి ప్రవేశించుటతోనె నాజీవితమున నూతన దశాప్రారంభ మయ్యెనని చెప్పనగును. నేనిదివఱకు సంవత్సరముల కొలఁది పాఠశాలలలో నుపాధ్యాయత్వము సాగించి యలసితిని. బెజవాడపురమను వేడిమంగలమున నేండ్లకొలఁది వేఁగితిని ! వత్సరముల తరబడిని పత్రికాధిపతినై, చందాదారులతో నుత్తరప్రత్యుత్తరములు జరిపి డస్సిపోయితిని. ఇప్పుడీ పనులన్నిటిలో నాకుఁ గొంతవిరామము గలిగెను ! ఇంతటినుండి నేను కళాశాలలో నుపన్యాసకుఁడనైతిని. పెద్దతరగతులకు నున్నతవిద్య బోధింపనా నా కిన్నాళ్ల కవకాశము కలిగెను. మనసు వచ్చినట్టుగ కళాశాల తరగతులకు నాయభిమానవిద్యను నేనిఁక బోధింపవచ్చును. ఈపర్లాకిమిడిపట్టణమున పెద్దరాజమార్గము చివర దట్టముగ పచ్చని పొదలల్లుకొనిన యున్నతపర్వతము గలదు. రెండవ కొనయందు దర్శనీయమగు తటాకముగలదు. ఏ నడివేసఁగినో తక్క సామాన్యముగఁ గాల మిచట సౌమ్యముగనుండును. కొన్నిమాసముల నుండి "జనానాపత్రిక" సంబంధమగు చిన్న పనులన్నియు మద్రాసు