పుట:2015.373190.Athma-Charitramu.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 412

పత్రికపను లన్నియు నాతనిమీఁదనే పడును ! కావున పత్రికాసంపాదకత్వము సంతోషజనకము గాక, యతని కొక శిక్షగా నగుచున్నది !

"ఇట్టి బానిసపనుల కీ జనానాపత్రికాధిపతియు లోనైయున్నాఁ డని వేఱె చెప్పనక్కఱలేదు ! ఎల్లకాలము నేకరీతిని కష్టపడుటకు మానవప్రకృతి యోరువఁ జాలదు ! * * * కాఁబట్టి మా కీ సత్కార్యమున సహాయము చేయుఁ డని యార్యులను విద్యాధికులను వేఁడుచున్నాము."

ఇపుడు చెన్నపురిలో ముద్రాలయమును నెలకొల్పి జరుపుచుండు వీరేశలింగము పంతులుగారిని, "జనానాపత్రిక" ముద్రణాదికార్యకలాపమును గైకొనుఁ డని కోరుచును, నేను పత్రికా సంపాదకునిగ నుందునని చెప్పుచును నే నొక లేఖ వ్రాసితిని. ఆయన దీనికి సమ్మతించి, తాము స్థాపింపనున్న యొక వార్తాపత్రికకు ఆంగ్ల వ్యాసములు వ్రాయుఁడని జూలయి 22 వ తేదీని నాకు లేఖనంపిరి. మఱునాఁడే వారికి వందనము లర్పించుచు నేను బ్రత్యుత్తర మిచ్చితిని. కాని, వెనువెంటనే బ్రాహ్మసమాజమువారి ముద్రాలయమునుండి నా పత్రికను దీసివేయలేకయు, పాఠశాలలోని పనితొందరవలనను, నే నొక నెల యాలసించి, ఆగష్టు 23 వ తేదీని పంతులుగారి కీ విషయమున జాబు వ్రాసితిని. దీనికి పంతులుగారు 28 వఆగష్టున పెద్ద ప్రత్యుత్తర మిచ్చిరి. నేను జేసిన యాలస్యమునకు నామీఁద వారి కాగ్రహము జనించెను. వా రిపుడైనను మా పత్రికకు సాయము చేయ సిద్ధముగ నుంటి మనుటచేత, నేను సెప్టెంబరుసంచిక మొదలు మాపత్రికను వారి కొప్పగింప నిశ్చయించుకొని, 30 వ ఆగష్టున మొదటివ్యాసము వ్రాసి వారి కంపితిని.