పుట:2015.373190.Athma-Charitramu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము


విద్యాప్రారంభ మైనదిమొదలు మా తల్లితో పలుమాఱు నేను రేలంగి వెలివెన్ను గ్రామములమధ్య రాకపోకలు సల్పుచుండుటచేత, నే నా రెండుగ్రామములందలి ప్రాఁతబడులు క్రొత్తపాఠశాలలు ననేకములు త్రొక్కి చూచితిని. తాటియాకులపుస్తకములు చేతఁబట్టి, చిన్ని చదురులు వెంటఁ గొనిపోయి, అమర బాలరామాయణములు పఠించి, ఎక్కములు మున్నగునవి విద్యార్థులు గట్టిగ వల్లించెడి బడులకును, కాకితపుఁబుస్తకములు కలము సిరాబుడ్లును, పాఠపుస్తకములు పలక, బలపములును, జదువరులు వాడుక చేయుపాఠాశాలలకును, గల వ్యత్యాసము నా కనుభవగోచర మయ్యెను. ఏదేని నూతన విద్యాశాలలోఁ బ్రవేశించిన క్రొత్తఱికమున దిన మొకయేడుగఁ దోఁచినను, గురువుస్వభావము కనిపెట్టి సహపాఠుల సావాసము మరగినకొలఁది నా కమితసౌఖ్యము గలుగుచుండెను. అర్థజ్ఞానము లేని యతిబాల్యదశయం దుండుటచేత, వల్లె వేయు వాక్యావళియందుకంటె పుస్తకాదుల రూపాదులమీఁదనే నా కెక్కువ మక్కువ యుండెడిది. నే జదివినను జదువకున్నను, నాచేతులలో జరిగిన 'బాలబోధ' ల ప్రతులకు లెక్క లేదు. ఆకాలమున చిన్న పరీక్షాధికారి గ్రామపాఠశాలను జూడవచ్చునపు డెల్ల, పాఠ్యపుస్తకములు తనవెంటఁ గొనివచ్చి, యమ్ముచుండువాఁడు. అంచులు మణఁగి పుటలు చినిఁగిపోయిన ప్రాఁతపుస్తకము నంతట మూలఁ ద్రోచివైచి, క్రొత్తది కొనినరోజు నాకు పండుగయె ! అట్టమీఁదిరంగు చూచియె పుస్తకమును గొనుట చిన్ననాఁడు నా కెంతో ముచ్చట ! అన్ని రంగులలోను ఎఱుపు నాకుఁ బ్రియమైనది. ఆకుపచ్చ మధ్యస్థము. నలుపు, పసుపు, గోధుమ వన్నెలు నాకుఁ గిట్టవు. నల్లయట్టపుస్తకము నా కంటఁగట్టిరని కోపించి, ఒకప్పుడు నేను జదువుమీఁద సమ్మెకట్టితిని !