పుట:2015.373190.Athma-Charitramu.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 358

భర్తృవిహీనయై వనరుచుండెడి మా ప్రియజనని కీపుస్తకము కృతియిచ్చి, సంతృప్తి నొందితిని.

17 వ మేయి తేదీ దినచర్యయం దిట్లు గలదు : -

"నే నీ మనోనిశ్చయములను జేసికొన్నాను : - (1) కోపపరవశుఁడను గాకుండవలెను. (2) నామాటలవలన నెవనిమనస్సును నొప్పింపవలదు (3) ఈశ్వరధ్యానమునకై తీఱికకాలము వినియోగింపవలెను. వృథాకాలక్షేపము చేయఁగూడదు. (4) ప్రలోభనముల బారిఁబడకుండ తప్పించుకొనవలెను. మనస్సునుండి విషయాసక్తిని గోసివేయవలయును." ఇవి యన్నియు మంచినియమములే. వాని నాచరణమునఁ జొప్పించుటయే కష్టతరమగు విషయము!

ఈ వేసవిని రాజమంద్రిలో తమ్ముఁడు వెంకటరామయ్యతోఁ గలసి నేను న్యాయశాస్త్ర గ్రంథములను చదివితిని. ఆతఁడు రెండవతరగతి పరీక్ష నిచ్చి యిపుడు రాజమంద్రిలో న్యాయవాదిగ నున్నాఁడు. మొదటి తరగతిపరీక్ష కాతఁడును, రెండవతరగతికి నేనును బోవలెనను సంకల్పముతో నిపుడు శ్రద్ధతోఁ జదివితిమి. తమ్ముఁడు కృష్ణయ్యకు ప్రథమశాస్త్ర పరీక్ష యాంగ్ల పఠనీయపుస్తకములు బోధించితిని. పెద్దవార మిద్దఱము నింత జదువుచుండినను, చిన్న వారలు కృష్ణయ్య సూర్యనారాయణ వ్యర్థకాలక్షేపము చేయుచున్నారని వారలను జీవాట్లు పెట్టువాఁడను. నా యారోగ్యము నసిగా లేదు. నా కంటెను తమ్ముఁడు వెంకటరామయ్య బలహీనుడె యని విచారించు చుండువాఁడను. జనని వ్యాధినిగుఱించి వైద్యాధికారి నడుగఁగా, ఆమె రోగనివారణము కష్టసాధ్య మనియు, తశ్శాంతిమాత్రము చేయవచ్చు ననియును, ఆయన చెప్పెను.