పుట:2015.373190.Athma-Charitramu.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 356

వేగిరపాటును, మా పాఠశాలలోని హిందూవిద్యార్థుల కందఱికి నొక్క మాఱుగ జ్ఞానస్నాన మిప్పింపఁగోరు చుండెను !

నేను సభ్యుఁడనైన లండను "మనస్తత్త్వ పరిశోధన సంఘము" వారి ప్రచురణములు నాకు క్రమముగ నందుచుండెను. వారి నూతన ప్రచురణము వినోదాంశములతో నిండియుండెను. ఆసమాజమువారి మాసపత్రికకూడ నాకు వచ్చుచుండెను. నాకోరికమీఁద వారు హిందూదేశమందలి సభ్యులకుఁ దమ గ్రంథముల ప్రతులు రెండేసియంపుట కంగీకరించిరి. అందువలన నాయుఁడుగారు నేనును గలసి యొక సభ్యునిచందా చెల్లించి, ఒక్కొక పుస్తకప్రతి నందుకొనుచుండువారము.

1899 సంవత్సరము 11 వ ఏప్రిలు వికారి సంవత్సరాది పండుగరోజున నా దినచర్య యిటు లుండెను : -

"ఏమికారణముననో కాని సతి నన్ను ప్రబలశత్రువునివలెఁజూచుచున్నది! తనకు ధన మీయలేదని నామీఁద పగఁబూనినది. ప్రస్తుత సంసారపరిస్థితులలో నే నెట్లు సొ మ్మీయనేర్తును ? ఆమెవిరోధ వై మనస్యములచే నా యుదారాశయములు తాఱుమా ఱగుచున్నవి! ఈశ్వరాదేశములగు నీయాశయముల నే నెట్లు త్యజింపఁగలను? * నేనిదివఱకు వ్రాసిన వ్యాసములు చదివి వినోదమునఁ గాలము గడిపితిని. కామశాస్త్రిగారితో నద్వైతమతమునుగూర్చి వాదించుచు, అందలి లోపములు వారికిఁ జూపించితిని."

మిత్రుఁడు వెంకటరత్నము నాయఁడుగారికి 120 రూపాయల జీతముమీఁద, సికిందరాబాదు మహబాబు పాఠశాలాధ్యక్షపదవి లభించిన దని తెలిసి నే నెంతయు సంతోషించితిని.