పుట:2015.373190.Athma-Charitramu.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 338

14 వ నవంబరున మేము వైద్యాలయాధికారిని దీసికొనివచ్చితిమి. వాతము క్రమ్మిన దనియు, రోగి జీవింపఁ డనియు, ఆయనచెప్పి వేసెను. మాతండ్రి కదివఱకు చాయాపటము తీయనేలేదు. మంచము మీఁదనే పడియుండు రోగిపటము తీయుఁ డని యిపు డొకచిత్రకారుని గోరితిమి. ఆతఁ డొకపట మెత్తి, అది పాడయ్యె నని చాలదినములకుఁ బిమ్మట మాకుఁ జెప్పివేసెను !

శిశువును బెంచురీతిని, నలుగురు సోదరులమును అహర్నిశము జనకునికిఁ బరిచర్యలు చేసితిమి. కాని, యాయనదేహస్థితి క్షీణదశకు వచ్చెను. ఒక్కొక్కమాఱు మిల్లె గరిఁటెఁడు పాలయినను మ్రింగలేక, ఆయన స్పృహతప్పిపడి యుండెను. వెక్కిళ్లు వచ్చునప్పుడు మాత్రము కొంచెము తెలివిగలుగుచుండెను కాని, యాస్పృహయే యాయనవేదనను మఱింత పెంచుచుండెను ! 15 వ నవంబరు రాత్రి యెక్కిళ్లు మితిమీఱెను. పొత్తికడుపు దగ్గఱనుండి లోనయేదో యెత్తుగ పొంగి, పామువలె కడుపులో పైకెగఁబ్రాఁకి, గొంతుదగ్గఱకు వచ్చునప్పటికి, రోగి, యొక్కొక్కప్పుడు ఉక్కిరిబిక్కిరి యగుచుండెను. ఇ ట్లొక్కొక్కప్పుడు ఊపిరాడక, ఆయన పడిపోవుచువచ్చెను. మృత్యువాసన్న మయ్యె ననుకొనుచుందుము. మరల తెప్పిఱిల్లుచువచ్చినను నాడి క్షీణించిపోసాగెను.

16 వ నవంబరు ప్రాత:కాలమున మాజనకునికి ప్రాణోత్క్రమణసమయ మాసన్నమయ్యెను. మరల దేశీయవైద్యుని పిలువఁగా ఆయన ముసాంబ్రపుగంధము రోగికడుపుమీఁద పట్టువేయించెను. వేంటనే వెక్కిళ్లు కట్టెను. అందుచేత మాకుఁ గొంత యాశ కలిగెను. కాని, రోగినాడి క్రుంగిపోవుచున్న దనియు, లాభము లేదనియు వైద్యుఁడు చెప్పివేసెను.