పుట:2015.373190.Athma-Charitramu.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 336

ఛావర్ణనమువలెనే కార్ల యిలు, అరీలియసుల తత్త్వశాస్త్రవిషయములును నాకు హృదయానుమోదము లే!"

హైదరాబాదు ప్రాంతములనుండి యారోజులలో బెజవాడ యొక స్వాములవారు వచ్చిరి. ఆయన గొప్పమాహాత్మ్యము గలవాఁడని జను లనుకొనిరి. స్వామివారిని సందర్శింపఁగోరి, 15 వ అక్టోబరు శనివారము వేఁకువనే కామశాస్త్రి వీరభద్రరావుగార్లు వెంటరాఁగా, నేను ప్రాఁతయూరు పోయితిని. స్వామివారు మౌనముద్ర నూనియుండుటచేత, వారి నిచటికిఁ గొనివచ్చిన బెజవాడ నివాసులగు శ్రీగోవిందరాజుల రామప్పగారితో మేము ప్రసంగించితిమి. స్వామివారు తమ వయస్సు 800 వత్సరములని నుడివి రని తెలి సెను. ఆయన నిరశనవ్రతులుకూడనఁట!

ఆ సెలవుదినములలోఁ గొందఱు మిత్రులతోఁ గలసి నే నొకనాఁడు కొండపల్లి వెళ్లితిని. పర్వతశిఖరమగు "నొంటిమన్యము"ను జూచితిమి. అచటి ప్రకృతిదృశ్యము లత్యంతరమణీయములు.

6 వ నవంబరునాఁటి దినచర్య యిటులుండెను: - "రాఁబోవు సంవత్సరము వెంకటరత్నమునాయఁడుగారు నోబిలుకళాశాలనుండి వెడలిపోవుదురను దుర్వార్త వినవచ్చెను. నాయఁడుగారు బ్రాహ్మసమాజప్రచారమునం దమితోత్సాహము గలిగియుండుట, కళాశాలాధ్యక్షుఁడగు క్లార్కుదొర కిష్టము లేకుండుటయే దీనికిఁ గారణము ! నేను నాయఁడుగారి కొక పెద్దయుత్తరము వ్రాసి, పూర్వము మే మనుకొనిన 'ఆస్తికపాఠశాల' నిపుడు నెలకొల్పఁగూడదా యని యడిగితిని. ఆకాశము మేఘావృత మగుటచేత నేఁడు దుర్దినము. మిత్రుఁడు నాయఁడుగారినిగూర్చిన దు:ఖవార్త వినుటవలన నామనస్సునకును నేఁడు దుర్దినమే !"