పుట:2015.373190.Athma-Charitramu.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25. ఇంటితగవులు, మండల సభలు 321

మిత్రులగు దాసు శ్రీరాములుపంతులుగారిని గలసికొని, మఱునాఁటి సంస్కరణసభా కార్యక్రమమునుగుఱించి మాటాడితిని. సభల కేతెంచిన ప్రాఁతనేస్తులు గుంటూరులోఁ బలువురు గానఁబడిరి. దుగ్గిరాల రామమూర్తిగారును వచ్చియుండిరి. ఆకాలమున గుంటూరుపురము పూర్వాచారపరాయణత్వమునకు ప్రసిద్ధి నొందెను. కావున వితంతూ ద్వాహములనుగుఱించిన తీర్మానము సభలోఁ గావించుటకు గుంటూరు వారి కిష్టము లేదు.

రాజకీయ సంస్కరణసభలకు మిత్రులు వెంకటరత్నమునాయఁడుగారే యధ్యక్షులు. 21 వ తేదీని జరిగిన సాంఘిక విషయ నిర్ధారణసభ కెటులో వితంతూద్వాహవిషయకమగు తీర్మానమును అంగీకృతముఁ జేసితిమి. మధ్యాహ్నము జరిగిన ముఖ్య సభలో నేను స్త్రీవిద్యను గుఱించిన తీర్మానమును ప్రతిపాదించితిని. నా యుపన్యాసానంతరమున అధ్యక్షులగు నాయఁడుగారు లేచి, నేను బ్రచురించెడి "జనానా పత్రికను" స్త్రీవిద్యాభిమాను లందఱును దెప్పించుకొనుట కర్తవ్య మని నొక్కి వక్కాణించిరి. ఇందుకు వారియెడల కృతజ్ఞుఁడనే కాని, నాకోరికమీఁద వా రిట్లు చెప్పిరని జను లనుకొందురేమో యని నేను సిగ్గుపడితిని !

అతిబాల్యవివాహ నిరసనమును గుఱించిన తీర్మానమునకు పలువురు విరోధు లేర్పడిరి. ప్రభుత్వమువారు వివాహవిషయమున వయోనిర్ణయము చేయుటకే పలువురు సమ్మతింపకుండిరి. కావున పండ్రెండేండ్ల యీడురాని బాలికలకు వివాహము చేయరాదను తీర్మానమున కనేక సవరణలు వచ్చెను. వయోనిర్ణయము 11 సంవత్సరముల కుండవలయునని యొకరును, 10 సంవత్సరముల కని యొకరును, అడ్డు తీర్మానములు తెచ్చి, సభాకార్యక్రమమును నవ్వులాటలోనికి