పుట:2015.373190.Athma-Charitramu.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 306

"పంతులుగారూ, పట్నము సంగతులు మీకు బాగా తెలియవు. మనము జీతములు బాకీపడియుండుటయే మనబడికి శ్రేయము. ఉపాధ్యాయులు మన విద్యాలయమునుండి దాటిపోకుండ వారి కిదియే సంకిలి యగుచున్నది సుమీ !" అని అయ్యరుగారు నాకు సమాధాన మిచ్చిరి ! విద్యాశాలాధికారి కిట్లు ఉదారాశయములు లేకుండుట చేతను, తోడి బోధకుల కష్టములు నిరతము చూడలేకయు, నే నిట్టి పాఠశాలలో పాఁతుకొనిపోవుట వ్యర్థమని తలంచితిని.

ఇదిగాక, పెద్దపరీక్షలకుఁ జదువుటకు నాకీ పాఠశాలలో బొత్తిగ తీఱిక లేకుండెను. దీనికితోడు ఈ మహాపట్టణమున నేఁబది రూపాయిలతో నాకు జరుగదని నే నధైర్యపడితిని. అప్పులు తీర్చుట యటుండనిచ్చినను, తలిదండ్రుల పోషణమునకును, సోదరుల చదువునకును వలయు సొమ్ము మాసమాసమును నే నెట్లు సమకూర్పఁగలను ? ఈ కారణములచేత నేను బెజవాడకు సంసారమును తరలింపవలసి వచ్చెను.

నవంబరుమధ్యనే నేను సామానులు సరదుకొన నారంభించితిని. మద్రాసులో కొంతకాలము నివసించి యిచట సంస్కరణోద్యమ ప్రచారము సలుపు నుద్యమించిన వీరేశలింగముగారి సరకులు పుస్తకములు నపుడే రాజమంద్రినుండి వచ్చుచుండెను. నా సామానులు కొన్ని బకింహాముకాలువ పడవమీఁదను, కొన్ని రెయిలులోను వేసి, బెజవాడ కంపివేసితిని. అంత 26 వ నవంబరున మేము మద్రాసునుండి బయలుదేఱితిమి. చెన్నపురికాపుర మిట్లు కడతేఱెను ! తా నొకటి తలంచిన దైవ మొకటి తలంచును !