పుట:2015.373190.Athma-Charitramu.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 302

వెళ్లి, సుబ్రహ్మణ్యయ్యగారిని సందర్శించితిమి. ఆయన దయార్ద్ర హృదయుఁడు. నన్నాయన పాఠశాలకుఁ గొనిపోయి, ప్రతియుపాధ్యాయునికి నెఱుక పఱచిరి. పాఠశాల కడు బీదస్థితిలో నుండెను. తిరువళిక్కేణిలో నుండు బంధువు మంత్రిరావు వెంకటరత్నమును నే నపుడు కలసికొని, అతఁడు త్వరగా స్వస్థలమునకుఁ బోయి, భార్యకు మంచిమం దిప్పించుట యగత్య మని చెప్పితిని.

మఱునాఁడు నేను తిరువళిక్కేణి వెళ్లి, పూర్వము "ఆర్య పాఠశాలా" ప్రథమోపాధ్యాయుఁడును, ఇపుడు "హిందూపత్రికా" సహాయవిలేఖకుఁడునునగు శ్రీ. కే. నటరాజనుగారిని, వారిమిత్రులనుఁ జూచితిని. మాపాఠశాలలోని యొకబోధకుఁడు నాకు బస కుదుర్చుటకై నాతో వచ్చి, కొన్ని యిండ్లు చూపించెను. బ్లాకుటవను పోయి మిత్రుఁడు శ్రీ కొల్లిపర సీతారామయ్యగారిని జూచితిని. మఱునాఁడు ఆదివారము బ్రాహ్మమందిరమునకుఁ బోయినపుడు, రాఁబోవు రామమోహనరాయలవర్ధంతి సందర్భమున నొకయుపన్యాసము చేయుఁడని మిత్రులు నన్ను గోరిరి.

నేను పాఠశాలలో వెంటనే పనిచేయ నారంభించితిని. ఆవిద్యాలయ మంచిస్థితిలో లేదు. ప్రవేశపరీక్షతరగతి క్రమము తప్పి యుండెను. నేను జేయవలసిన కృషి యత్యధికముగఁ గలదు.

"ఆర్యపాఠశాల"కు సమీపముననందు నొకచిన్న యింటిలో నేను అద్దెకు రెండుగదులు పుచ్చుకొంటిని. ఆ యింటిలో రెండవ భాగమున సుబ్రహ్మణ్యయ్యరుగారి బావమఱఁదులు కాపుర ముండిరి. సెప్టెంబరు 26 వ తేదీని బ్రాహ్మసమాజమువారు రాజారామమోహనుని వర్ధంతి జరిపిరి. వారి మందిరమునఁ గూడిన బహిరంగ సభకు రా. బ. పనప్పాకం ఆనందాచార్యులుగారు అధ్యక్షులు.