పుట:2015.373190.Athma-Charitramu.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14. ప్రాఁతక్రొత్తలు 273

కాతనికి శరీరస్వాస్థ్యము కలిగెను. సెలవులపిమ్మట మేము మువ్వురమును బెజవాడ వెడలిపోయితిమి.

తమ్ముఁడు కృష్ణమూర్తి వెనుక రాజమంద్రిలోవలెఁ గాక యిపుడు చదువునం దెంతో శ్రద్ధవహించి యుండెను. ఆటలందును నతఁ డెక్కువ చుఱుకుగనుండెను. ఆరెండు సంవత్సరములును పాఠశాలలో నాటలనుగూర్చిన యేర్పాటులు నేనె చేయుచుండువాఁడను, సోదరుఁడు, స్నేహితులు, విద్యార్థులు మున్నగువారలతోఁ గలసి నేను కాలిబంతి, బాడ్మింటను బంతులాట లాడుచుండువాఁడను. మే మెంతో పట్టుదలతో నాడుచుండుటవలన, రెండుమూఁడు సారు లెదటికక్షలో నుండు సోదరుని వలననే నాకు కాలిబంతిదెబ్బలు పెద్దవి తగిలెను !

మాతండ్రి నా కాదినములలో వ్రాసిన యీ క్రిందియుత్తరము వలన, మాకుటుంబవ్యవహారములు, ఆయన శీలభావలేఖ నాదుల వైచిత్ర్యములునెగాక, ఆకాల పరిస్థితులును గొంతవఱకు తేటపడఁగలవు:-

"29 - 8 - 96 స్థిరవారం, రాజమంద్రి, యిన్నిసుపేట.

శ్రీరాములు.

"చిరంజీవులయిన మా కుమారుడు రాయసం వెంకటశివుడును సుబ్బారాయుడు చిరాయవులుగాను దీవిస్తిమి.

"తరువాత యిక్కడ అంత్తా క్షేమం. యీనెల16 తేది లగాయతు 23 తేదీవర్కు గోదావరి పుష్కరములు. తూర్పుపడమర ప్రజలు రెయిలు వుండుటచేత అన్కేమంది జనం వచ్చినారు. కోట్లింగాలవద్ద సరకారువారు విస్తారం పాకలు వేయించ్చినప్పట్కి, అనే కేమంది బస్తీలోనే ప్రవేశించ్చినారు. రేవులవద్దను వీధులలోనూ