పుట:2015.373190.Athma-Charitramu.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13. సహవాసులు 265

జాబువచ్చెను. "జనానాపత్రిక" వ్యాసశైలి కఠినపాకమున నున్నదను మొఱ విని, నే నాశ్చర్యవిషాదముల నందితిని !

24 వ సెప్టెంబరున అనంతముగారు, రామమూర్తిగారు నేనును సకుటుంబముగ విద్యార్థులు కొందఱితోఁ గలసి, కొండపల్లి కొండను జూచుటకై రెయిలుమీఁద బయలుదేఱి, అచటి సత్రములో రాత్రి విడిసితిమి. మఱునాఁడు వేకువనే చలిదియన్నము తిని, అందఱము కొండయెక్క నారంభించితిమి. విద్యార్థులు మాముందు దుముకుచు కోఁతులవలె కొండ కెగఁబ్రాకిరి. ముందు పురుషులము, వెనుక స్త్రీలు నంత బారుగ నేర్పడి, నడువసాగితిమి. అచటి దృశ్యము లత్యంతరమణీయములుగ నుండెను. దారి కిరుకెలంకులను చెట్లు, పొదలును గలవు. వానిమీఁదఁగూర్చుని పక్షులు మధురరుతములు చేయుచుండెను. సుందరలతలు, కమ్మఁదావుల వెదజల్లువృక్షములు, వృక్షములఁ దల దాల్చిన పర్వతశిఖరములును, కనుల పండువు సేయుచుండెను. సృష్టిలో ప్రస్ఫుటమైన సర్వేశ్వరుని సుందరాకారము మాకు చక్షుగోచర మయ్యెను. కొండమీఁద "కిల్లా" మా కపుడు కానవచ్చెను. పాడుపడిన ప్రాచీనపుకోటగోడలు చూచి పూర్వకాలపుసంగతులు నాకు స్ఫురణకు వచ్చెను. ఈదృశ్యము లాధారముగఁ గైకొని ముందు నేనొక చిత్రకథ గల్పింప సంకల్పించుకొంటిని ! కొనకొండమీఁదికి మే మంత వేవేగమే ప్రాఁకిపోయితిమి. అచట గీతములు పాడి వినోదమునఁ గాలక్షేపము చేసితిమి. రాత్రి యగుసరికి మేము కొండ దిగి, సత్రమున కేగి, మరల నచట వంటచేసికొని సుఖభోజనము చేసితిమి. మఱునాఁడు చలిదియన్నము తిని రెయిలుస్టేషనుకు వెడలిపోయితిమి. కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి కెక్కినది. బోగముమేళములు, కలెక్టరుకచేరి, తాడిదానిమ్మలు, ఆవులు, పాములు మొదలగు జంతువులు,