పుట:2015.373190.Athma-Charitramu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 240

పూర్తిచేసినఁ గాని నా కీవృత్తిలో వేతనాభివృద్ధి గలుగ దనుట స్పష్టము. ఆ పరీక్షలో జయ మందుటకు వేఱుగ ప్రయత్న మక్కఱయే లేదు. నన్నుగుఱించి పరీక్షాధికారులు సదభిప్రాయ మందుటయే నా విజయమునకు హేతువు. ఇట్టి యదృష్టముమీఁద నేను బూర్తిగ నాధారపడక, స్వయంకృషిచేత దీని కంటె నుత్తమపరీక్ష నిచ్చి, బోధకవృత్తిని చిరస్థాయిగఁ జేసికొనవలదా ? అదియే యం. యే. పరీక్ష. నే నందు జయ మందినచో, యల్. టి. లో మరలఁ దప్పిపోయినను, ఏ కళాశాలలోనైన నిప్పటికంటె మిగుల గౌరవస్థానమును బడయనర్హతను గాంచియుందును. కావున నేనా యున్నత పరీక్షకుఁ జదువ నిపుడు దీక్షవహించితిని. ఆంగ్ల సాహిత్యమునందు నా కభిరుచి మెండు. అయినను దానిలోకంటె తత్త్వశాస్త్రముననే నేనా పరీక్షకుఁ జదివినచో, వినోదములును, జ్ఞానదాయకములునునగు మహత్తరవిషయము లనేకములు గ్రహింప నా కవకాశము గలుగును. ఇట్లే చేయుమని వెంకటరత్నమునాయఁడుగారు మున్నగు మిత్రులును నాకుఁ జెప్పిరి. కావున నేను తత్త్వశాస్త్రమున యం. యే. పరీక్షకుఁ జదువ నుద్దేశించుకొంటిని.

నే నానాఁడు నిశ్చయించుకొనిన సంగతి యింకొకటి కలదు. నా కీలోకమునఁ బ్రియతమమగు విషయములలో పరిశుద్ధాస్తికమతవ్యాపనమొకటి. ఇది మెల్లగఁ గొనసాగించుటకుఁ బ్రార్థనసమాజస్థాపన మావశ్యకము. ఈబెజవాడపట్టణమం దిదివఱకు బ్రార్థనసమాజము లేకుండినను, ఏతత్సమాజాభిమానులు లేకపోలేదు. కాని, వయసు వచ్చినవారినికంటె, విద్యార్థియువకులనే ప్రార్థనసమాజసభ్యులగఁ జేర్పఁబ్రయత్నించుట శ్రేయము. బాల్యమున విద్యార్థిమనోక్షేత్రమునఁ బడిన మతబీజములు సకాలమున మొలకలెత్తి భావిజీవితమున విజృం