పుట:2015.373190.Athma-Charitramu.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. జనానాపత్రిక 229

తగవులకుఁ గారణమైన సత్యసంవర్థనిని నేనిఁక విడిచివైచి, జనానా పత్రికను జేపట్టుట యుక్తమని నా కాతఁ డాలోచనఁ జెప్పెను. అంత నేను రాజమంద్రి తిరిగి వచ్చిన పిమ్మట, సోదరుని యాలోచనఁ గూడఁ గైకొని, 6 వ తేదీని మల్లాది వెంకటరత్నముగారికి జాబు వ్రాసితిని. నా సంపాదకత్వమున జరుగు జనానాపత్రికకుఁ దాము నిర్వాహకులుగ నుండి కొంతకాల మది నడపుచుందు మని వెంకటరత్నముగారు ప్రత్యుత్తరమిచ్చిరి. నే నపుడు వ్రాసిపంపిన "పూవుల"ను గుఱించినదియె యాపత్రికలో నామొదటి వ్యాసము.

చిన్ననాఁడు నాకెంతో సంతోషదాయకముగ నుండిన "డాన్ క్విగ్జోటు" నవల నీవేసవిని మిగుల తమకమునఁ జదివితిని. నే నీకాలమున నమితముగఁ జదువుచుండుటవలననే కనులకును శరీరమందును బలహీనత హెచ్చిపోయెను.

ఈకాలమున నా దైవభక్తిని గుఱించియు ప్రార్థనలరీతిని గుఱించియు నొకింత తెలుపవలెను. నేను నిత్యవిధిగ వ్రాసెడి దినచర్య పుస్తకములందు నా ప్రార్థనానుతాపముల పోకడలు నానాఁట సూచితమగుచుండెను. శత్రుమిత్రులు నాలోపము లెన్ను చుండిరని నే నొక్కొక్కప్పుడు కటకటఁబడుచుంటిని కదా. ఇతరుల కన్నులకుకంటె నాచక్షువులకే నాలోపపాపముల మిగుల స్ఫుటముగఁ దోఁచుచుండెను. ఆత్మోపాలంభనములో పరుల దోషారోపణము లొకవీసమైన కఱకు లేకుండెను ! నా పాపచింతనమునకును కుటిల వర్తనమునకును, నేను సంతతానుతాపానలమున దగ్ధుఁడ నగుచుండియు, మరల నీవక్రచర్యలకే గడంగుచుందును ! స్వకీయపాపలేకమునుఁ బరిశోధించుటయందును, లోపముల వివరములను గుర్తెఱుంగుటయందును, న న్నెవరును మించియుండరు ! కాని, యీ పాప