పుట:2015.373190.Athma-Charitramu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. వేసవిసెలవులు 225

శాలలో బోధనాభ్యసనముఁ జేయుచుండిరి. స్నేహితు లిట్లు గురు శిష్యు లయిరి !

10 వ తేదీని నన్నుఁజూచుటకు మృత్యుంజయరావు మాయింటికి వచ్చెను. ఇటీవల రాజమంద్రిలో జరిగిన ప్రార్థనసమాజ సమావేశమున నన్ను గుఱించియు, నా తమ్ముని గుఱించియు నతఁడేల ద్వేష భావమున మాటాడి, మామీఁద నపనిందలు వెలయించెనని యాతని నడిగితిని. అతఁడు ప్రత్యుత్తర మీయలేదు. మిత్రుల పోరాటములు లెక్కసేయక యథాప్రకారముగ నేను "సత్యసంవర్థని"కి వ్యాసములు వ్రాసి యచ్చున కిచ్చుచుంటిని. కాని, కొలఁదిరోజులలో నరసింహరాయుడుగారిని నేను గలసికొని, యిటీవలి యల్లరికిఁ గారణ మడుగఁగా, "మీ రెప్పటివలెనే నిరంకుశాధికారముఁ జెల్లింపఁ బ్రయత్నించుచున్నారు. ముం దట్లు సాగనీయము. సరియైన త్రోవను మీరు పత్రికను నడపిననే మే మందఱమును మీకు సాయముచేతుము" అని యాయన చెప్పెను. ఈమాటలు విని నే నిఁక "సత్యసంవర్థనీ" పత్రికతోడి సంబంధము విడువ నుద్యమించితిని. పత్రిక విషయమున కనకరాజు, మృత్యుంజయరావు, నరసింహరాయుడుగార్లు మామీఁదఁ గినుక వహించుట నేను సవిస్తరముగ గ్రహించి, దానితో జోక్యము వదలుకొన నిశ్చయించితిని.

శ్రీ మల్లాది వెంకటరత్నముగారి కోరికమీఁద, శ్రీమతి సత్యనాథము కృపాబాయిగారు ఇంగ్లీషున రచించిన "సగుణచరిత్రము"ను నేను తెలుఁగుఁ జేయనారంభించి, అచ్చువేయుటకై కొన్నిప్రకరణములు వారికిఁ బంపితిని. లివింగ్సుటను చరిత్రమును జదివితిని. అమహామహుని యపారదైవభక్తికి నే నాశ్చర్యమంది, నాజీవితము నటులే ధన్యముఁ జేయు మని దైవమును వేఁడితిని.