పుట:2015.373190.Athma-Charitramu.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. ప్రార్థనసమాజము 223

మున్నగు నుపాహారములు సిద్ధపఱిచిరి. మే మానాఁ డెంతో సంతోషమునఁ బ్రొద్దుపుచ్చితిమి.

రాజమంద్రికళాశాలావిద్యార్థులలో పట్టపరీక్షలో నాంగ్లమునఁ బ్రథమునిగ నుత్తీర్ణత నొందుటచే నాకు బహుమతి చేయఁబడిన స్కాటువిరచిత కథావళిని నే నీసమయమునఁ జదువుచువచ్చితిని. ఒక్కొక్కసారి యింగ్లీషు పుస్తకములలోని యంశములును, ఆంధ్రగ్రంథములును, పత్నికిఁ జదివి వినిపించుచుందును. ఏప్రిలు 27 వ తేదీని, స్కాటువ్రాసిన 'ఐవాన్‌హో'నవలను బూర్తిచేసితిని. కథా నాయికయగు 'రిబెక్కా'కాంతవిషయమై కృతికర్త పక్షపాతబుద్ధిఁ జూపె నని నే నసంతృప్తిఁ జెందితిని. ఆ యంగన యౌదార్యసచ్ఛీలతాసౌందర్యముల కనురూపమగు సౌభాగ్యగరిమ మామె కొసంగ లేదనియు, ఐవాన్‌హోను బరిణయమై రిబెక్కా సౌఖ్యాబ్ధి నోలలాడెనని కవి వర్ణింప లేదనియును, నేను విషాదమందితిని.

ఏప్రిలు 25 వ తేదీని అమలాపురము పాఠశాలాప్రథమోపాధ్యాయునియొద్దనుండి నాకొక జాబు వచ్చెను. నా కాపాఠశాలలో ద్వితీయోపాధ్యాయునిపదవి నీయుఁ డని పాఠశాలలపరీక్షాధికారియగు నాగోజీరావుపంతులుగారు సిఫారసు చేసినట్లు వారు వ్రాసిరి. ఈ సంగతిని గుఱించి తలపోయుచు నామనస్సు మరల చంచలగతి నందెను !

నాలుగవ మేయితేదీని అనంతముగారు సతీసమేతముగ మమ్ము సందర్శింపవచ్చిరి. వారు మాయింటికి వచ్చినందుకు ఇంటి వారు తప్పు పట్టెదరేమో యని మేము భీతిల్లితిమిగాని, యట్లు జరుగ లేదు. సజ్జనులగు ననంతముగారి యెడ బెజవాడ వాస్తవ్యుల కమిత భక్త్యనురాగములు గలవు.