పుట:2015.373190.Athma-Charitramu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50. పత్రికా యౌవనము 211

మయ్యెను. 93 వ సంవత్స రారంభమునుండి నాయింగ్లీషువ్యాసము లింకను దీర్ఘములై భాషాసారస్యమున నొప్పారుచుండెను. ఆసంపుటములో నేను వ్రాసిన "అంతరంగికమతము." "ఈశ్వరధ్యానము", జాగ్రన్మోక్షము", "స్త్రీస్వాతంత్ర్యము" మున్నగువ్యాసములలో విద్యానుభవములందు దినదినాభివృద్ధి నొందెడి మనశ్శక్తుల వికాసము విస్పష్టమయ్యెను. ఆంగ్లసాహిత్య మనస్తత్త్వశాస్త్రములలో నాకుఁ దెలిసిన నూతనాంశములను, నేను విశ్వసించిన పరిశుద్ధాస్తిక మత సిద్ధాంతములతో సమన్వయము చేసికొని, నా యభిప్రాయములను వ్యక్తీకరించితిని. నాశైలి యిపుడు పొంకమును గాంభీర్యమును దాల్చియుండెను.

సత్యసంవర్థనియందలి యితర రచయితల వ్యాసములందును, అభివృద్ధి గాననయ్యెను. వీరేశలింగముపంతులుగా రదివఱకె విఖ్యాతిఁ జెందినగ్రంథకర్త లైనను, సత్యసంవర్థనికిఁ దఱచుగ వ్రాయుకొలఁది వారివ్రాఁతలును నునుపెక్కెను. 1893 వ సంవత్సరమున వీ రాపత్రికలో, "వర్ణము", "విద్యాధికులధర్మములు" నను దీర్ఘోపన్యాసములు వ్రాసిరి. ఇవి వారియుపన్యాసములలో నెల్ల ప్రథమగణ్యములు. మొదటిది విషయబాహుళ్యముచేతను, రెండవది వాదన పటుత్వమునను, లలితవాక్యసంఘటనమునను బేరెన్నిక గన్నది. మాతమ్ముఁడు వెంకటరామయ్య, 93 మే సంచికలో వ్రాసిన "కేశవచంద్రబ్రహ్మానందులు", 94 వ సంవత్సరరాంభమున వ్రాసిన "నీతిమతములు"ను, అపుడె రమ్యవ్యాసరచన మాతనికిఁ బట్టుపడుటను సూచించుచున్నవి. అందఱి కంటెను కనకరాజుని వ్రాఁతలలోని యభివృద్ధి మిగుల స్పష్టముగ నుండెను. వ్యాసరచనమందును, గ్రంథవిమర్శనమునను, అతనికలము కఱకుఁదనము గాంచియుండెను. 93 జూనులోఁ బ్రచురింపఁబడిన