పుట:2015.373190.Athma-Charitramu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 204

26 న సెప్టెంబరు వీరేశలింగముగారు చెన్నపురి వచ్చిరి. వారిని జూచుటకు మేము పరశువాకము పోయితిమి. చెన్నపురి యందలి యితరమిత్రులు నచటి కేతెంచిరి. మఱునాఁడు, పంతులుగారికి మేము విందు చేసితిమి. ప్రార్థనసభలో పంతులుగారు ఉపన్యాసము చేసిరి. పట్టణము పోయి నేను స్నేహితులను జూచి వచ్చితిని. పంతులు గారికిని, మాకును స్నేహితులు విందులు చేసిరి. పంతులు గారి కంత మేము వీడ్కో లొసంగతిమి.

ఈవిందులు గుడిచిన నాకు మరల శరీరమునం దస్వస్థత యేర్పడెను. దీనికిఁ దోడుగ, మావిద్యాసంస్థను గుఱించి గంగరాజునకు నాకును భిన్నాభిప్రాయములు గలిగెను. మనశ్శరీరములు డస్సి నే నంతట సైదా పేట వెడలిపోయితిని.

ఆదినములలో నామనస్సు నమితముగఁ గలంచినవిషయము, "ఆస్తికపాఠశాల"నుగూర్చినదియె. ఆపాఠాశాలా స్థాపనముతోనే నాయుద్యోగసంపాదనాసమస్యయుఁ బెనఁగలసి యుండెను. పాఠశాల యేర్పడు నని యొకమాఱును, లే దని యొకమాఱును మాకుఁ దోఁచు చుండెను. "సంగీతముచేత బేరసారము లుడిగెన్" అనునట్లు, ఆస్తికపాఠశాల నెలకొల్పువిషయమున భిన్నాభిప్రాయము లేర్పడి, మా స్నేహితులలో వైషమ్యములు జనించెను. ఒకచోటనే చదువు సాగించు కొనుచుండెడి మృత్యుంజయరావునకు నాకును పూర్వసౌహార్దసామరస్యములు వేగముగ నెగిరిపోవుచుండెను !

కొలఁదికాలములోనె మే మిచట విద్యాపరిపూర్తి చేసి, యుద్యోగసంపాదనము చేయవలెను. రాజమంద్రిలో "ఆస్తికపాఠశాల"స్థాపిత మైనచో, మిత్రులతోఁ గలసి నే నందు పని చేసెదను.