పుట:2015.373190.Athma-Charitramu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము, గతించిన యేబదేండ్ల ఆంధ్రాభ్యుదయమును సింహావలోకనముచేయుటకును, భావ్యభ్యుదయమునకును, సాధనముగనున్నది; వీరేశలింగము పంతులు; వేంకటరత్నమునాయుడు, కనకరాజు, రామమూర్తి, పాపయ్య, రంగనాయకులు నాయుడుగార్ల పవిత్రజీవితముల సంస్మరణమునకును, ఆత్మసంస్మరణమునకును సాధనంబుగ నున్నది; సాహిత్యరచనలందును సాంఘికవ్యవస్థలందును, మతాచారాములందును, నిత్యజీవనమునందును సంప్రాప్తమైన భావక్రియాపరివర్తనమును గ్రహించుటకు వినియోగపడుచున్నది. కథకులు మతవిశ్వాసములందు గలిగిన పరివర్తనసందర్భముల తెలిపినభావము లాత్మచరిత్రయం దాత్మవిజయమును ప్రకటించుచున్నవి.

"వయోవిద్యానుభవములతో నాగుణశీలముల కెట్టి పరిణామము గలిగెనో చదువరులు గమనించియున్నారు. అన్నిటికంటెను నామత విశ్వాసములందలి పరివర్తనమె మిగుల స్ఫుటముగఁ దోఁచును. బాల్యకాలమునందలి వైష్ణవక్రైస్తవవిశ్వాసములు యౌవనమున బ్రాహ్మ ప్రార్థనసమాజాదర్శరూపము దాల్చినను, పూర్వవాసనలు పిమ్మట పూర్తిగ వీడెనని కాని, పరిణామకార్య మింతతో నిలిచిపోయె నని కాని చెప్ప వలనుపడదు. లోకానుభవము హెచ్చినకొలఁది, బ్రాహ్మ మతోద్బోధకమగు పరిశుద్ధాస్తికాదర్శముల పోకడలు, బ్రాహ్మ