పుట:2015.373190.Athma-Charitramu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

45. సైదాపేట 193

విద్యావిశారదుఁడును, విశాలహృదయుఁడును. ఆ విద్యాలయమందలి విద్యనిరర్థక మని చెప్పివేయ నాయన వెనుదీయఁడు ! ఇంగ్లండుదేశమందలి విద్యార్థులనుగుఱించియు, విద్యాశాలలనుగుఱించియు, వినోద విషయములాయన వలన వినుచుందుము.

మే మచట మా విద్యార్థులకుఁజేయు బోధనావిధానమును గుఱించి కొంచెము చెప్పవలెను. ఇంచుమించుగ నందఱు విద్యార్థులును నిరక్షరకుక్షులె. విహారార్థమె వారు విద్యాశాలకు వేంచేయుచు, బోధకవిద్యార్థులగు మాబోటి క్రొత్తవారిని జూచి పరిహసించుచు, మాప్రశ్నలను వినుపించుకొనక వాని కపసవ్యసమాధానము లిచ్చుచు, చదువు నేరువవలె నను వాంఛ యేకోశమునను లేక, గురువుల కడ్డంకులు గలిగించుచు వ్యర్థకాలక్షేపము చేయుదురు ! విద్యార్థుల నేపట్టునను గొట్టక తిట్టక మఱి విద్యాబోధన చేయవలె నను విపరీత సిద్ధాంత మా విద్యాశాలయందు ప్రాచుర్యమున నుండుట గ్రహించి, విద్యార్థులు వినయవివేకములు వీడి, సర్వస్వతంత్రులై మెలఁగు చుండిరి. ఇచటి వికారపువిద్యలు విపరీతవిధానములును జూచి, ఏదో యొకవింతలోకమున నుంటి మని కొన్నాళ్లవఱకును మే మనుకొంటిమి.

మృత్యుంజయరావు, అతనిభార్యయును ఇపుడు సైదాపేటలో నొకచిన్న యింటఁ గాపుర ముండిరి. నేను అఱవ పూటకూటింట భుజించుచు, స్నేహితునిబసలో నివసించుచుంటిని. కొలఁదిదినములలో ప్రథమశాస్త్రపరీక్షాఫలితములు తెలిసెను. మాతమ్ముఁడు వెంకటరామయ్య ఆపరీక్షలో నుత్తీర్ణుఁడై, పట్టపరీక్షతరగతిలోఁ జేరెను. మృత్యుంజయరావు తమ్ముఁడు కామేశ్వరరావు చెన్నపురిలో పట్టపరీక్షకుఁ జదువుచు, సైదాపేటలోని యన్న యింట విడిసియుండెను. ఆర్య పాఠశాలాధికారియు, హిందూపత్రికాసంపాదకులును నగు జి. సుబ్ర