పుట:2015.373190.Athma-Charitramu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40. రోగారోగ్యములు 177

"మంగళ. 19 జూలై. దేహ మింకను ససిగా లేదు. ప్రొద్దున ముద్రాలయమున కేగి పని చేసితిని. ప్రాఁతశత్రువగు కనులత్రిప్పు మరల రెండుసంవత్సరముల కీనాఁడు గనఁబడినది. దాని వెన్నంటి యుండు తలనొప్పిచే రోజంతయు బాధపడితిని. ఆరోగ్య మిట్లు ఊఁగులాడుచున్నది !"

పైని జెప్పినదానిలో రెండుసంవత్సరముల కనునది రెండునెలలని యుండవలయును. రెండునెలలకైనను, రెండుసంవత్సరములకైనను, శరీరముపై మోయలేని బరువులెత్తుటచేతనేకదా ప్రాఁతరోగములు బయలుపడుచుండును ! విద్యార్థులకు పరీక్షాకాలము పెద్దపరీక్షాకాలమె !

రోగముతో నిట్లు నిరంతరయుద్ధము సల్పుచుండు నాదేహము, అక్టోబరు చివరభాగమున మరల వ్యాధిగ్రస్థ మయ్యెను. శరీరమందు ససిగా నుండనిసమయమున పాఠములు చదువుచును, పరీక్షలకుఁ బోవుచును, పత్రికకు వ్రాయుచును, విందులు గుడుచుచును నుండుటచేత' అక్టోబరు 27 వ తేదీని నాకు పెద్దజ్వరము వచ్చెను. వేసినమందు వికటించి రోగము హెచ్చెను. ఆమఱునాఁడు నన్ను లంకణ ముంచిరి. రాత్రి పదిగంట లగుసరికి నాకు తల తిరిగెను. ప్రాణ మెగిరిపోవు నటు లుండెను. చూచుచుండఁగనే కాలుసేతులు చివరనుండి చల్లఁబడి మొద్దుపాఱఁజొచ్చెను ! స్పృహమాత్రము స్ఫుటముగ నుండెను. ఇది యంత్యావస్థ యని నే ననుకొని, ఒక కేక వేసితిని. జీవిత మంతయుఁ జేసెద ననుకొనిన ఘనకార్యములు సాధింపకయే నే నిట్లగుచుండుట కాశ్చర్య మందితిని. భోజనము చేయుచుండు నా తల్లియు, భార్యయు నంతట లేచివచ్చిరి. అంత పొరుగువీథి నుండిన యొకవైద్యుని గొనివచ్చిరి.