పుట:2015.373190.Athma-Charitramu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 162

కొని, అనుమానరహితము చేసికొని వచ్చుట కర్తవ్య మని రంగనాయకులునాయఁడుగారు చెప్పి, తమతమ్ములును రాజధానీవైద్యకళాశాలలో నధ్యాపకులును నగు నారాయణస్వామినాయఁడుగారికి నన్ను గుఱించి వ్రాసిరి. నేనంత కళాశాలకు శీతకాలపు సెలవు లీయకమునుపే గుంటకల్లుమార్గమున రెయిలులో చెన్నపురికిఁ బోయితిని. వెంకటరత్నమునాయుఁడుగారి యేర్పాటుచొప్పున నేను బ్రాహ్మమందిరమున విడిసియుంటిని.

మరల నేత్రవైద్యాలయమున నాకనులు పరీక్షింపఁబడెను. ఈమా ఱచట వైద్యాధికారియగు కింగు అనుదొర నాకనులు పరీక్షించి, అం దేమియు దోషము లే దని చెప్పివేసెను. ముత్తెపుసరములవంటి చుక్కలు కనులనరములమీఁద నుండినను, వానివలన దృష్టికేమియు విఘాతము గలుగదనియు, కనులమంటలు శరీరదౌర్బల్యమున జనించిన వగుటచేత, బలమునకు మందు పుచ్చుకొనవలెననియును ఆయన నుడివెను. ఈయభిప్రాయమును వెంకటరత్నము నాయుఁడుగారి మిత్రులగు వైద్యులు నంజుండరావుగారు స్థిరపఱిచిరి. కావున నేను కనులనుగుఱించి భీతిల్లక, క్రొత్తనేస్తులగు వెంకటరత్నమునాయఁడు, నారాయణస్వామినాయఁడుగార్ల సావాసమునఁ గొన్ని దినములు గడపితిని.

నారాయణస్వామినాయఁడుగారు తమయన్న వలెనే క్రైస్తవమతవిశ్వాసులే కాక, క్రైస్తవధర్మస్వీకారము చేసినవారును. ఆయన బ్లాక్‌టౌనులోఁ గాఁపుర ముండిరి. సోదరునివలెనే వీరును సహజ సౌజన్యస్వభావులును, దయార్ద్రహృదయులును. అన్న దమ్ములకుఁ గల భేదములును నేను గనిపెట్టితిని. అన్న గంభీరస్వాభావుఁడు, తమ్ముఁడు సరళశీలుఁడు. ఈ భేదము మతానుష్ఠానమునందును ప్రస్ఫుట