పుట:2015.373190.Athma-Charitramu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 156

గారితో నేను బ్రస్తావింపఁగా, దురవస్థ నుండు నిట్టివారిసంరక్షణ కే ధర్మసంస్థయు నేర్పడక యుండుట కాయన వగచి, తా నే సాయమైనఁ జేతు నని చెప్పెను. జను లందఱివలెనే నాయుఁడుగారును దిక్కుమాలిన యాముసలిదాని సంగతి మఱచిపోయి రని నేను దలంచితిని.

ఒకనాఁడు నేను రంగనాయకులునాయుఁడుగారిని జూచి వచ్చుటకు వైద్యాలయమున కేగితిని. ఆయన నాతో సంభాషించుచు, కొంత సేపటికి నా కొకచిత్రము చూపింతు నని చెప్పి, వైద్యశాల వెనుక నున్నయొక మాఱుమూలకు నన్నుఁ గొనిపోయెను. నాయుఁడుగా రొసంగిన తెల్లనివలువ దాల్చి, ఆబీదగ్రుడ్డిముసలిది, పెండ్లికూఁతునివలె నచటఁ గులుకుచుఁ గూర్చుండెను ! వార్ధక్య దారిద్ర్యములు తప్ప వేఱు వ్యాధి లేని యాముదుసలి, నాయుఁడుగారి దయచే వైద్యాలయమున రోగిగఁ జేరి, సువార మారగించుచుండెను ! దిక్కు లేక బాటప్రక్క గాసిల్లుగ్రుడ్డిది, వైద్యాలయమందలి సౌకర్యములచే నిపుడు నునుపెక్కి, తేటమొగమున నుండుట చూచి, మాయిరువురకును గనుల నీరు గ్రమ్మెను. నాయుఁడుగారిమాట వినఁబడి, వృద్ధురాలు దండముపెట్టి, ఆయనను జేరువకుఁ బిలిచి, ఏదో మాటాడెను. ఆయన చిఱునవ్వు నవ్వుచు, "దీనికి నల్ల మందు అలవాటు. కాని, అది వైద్యశాలలో నెవరికిని వాడము. దానికి మాఱుగ నేదో సరది యిచ్చెదను లెండి!" అని నాతో ననెను. నాయుఁడుగారిని దలంచుకొనినపుడు "తల్లి దండ్రుల భంగి ధర్మవత్సలతను, దీనులఁ గానఁ జింతించువాఁడు" అను ప్రహ్లాదుని గుఱించిన కవివచనము నాకు స్ఫురణకు వచ్చు చుండును.