పుట:2015.373190.Athma-Charitramu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28. పరీక్షావిజయము 125

యును, ఆయన చెప్పెను. అంతవఱకును నేను సులోచనములు పెట్టుకొనవలెనఁట ! చెన్నపురి వెళ్లి, సర్కారునేత్రవైద్యాలయమందలి నిపుణులచే వైద్యము చేయించుకొనుట మంచిదని స్నేహితులు చెప్పిరి. ఈసంవత్సరము జరుగనున్న జనాభాపనులలో నేను స్వచ్ఛంద సేవకునిగఁ బని చేతు నని పురపాలకసంఘమువారికి మాట యిచ్చి యుంటిని. నాబదు లెవరును పనిచేయ నొప్పకుండినందున, వెను వెంటనే నేను చెన్నపురి పోవుటకు వలనుగాకుండెను. నా నేత్ర రోగమును గుఱించి తలిదండ్రులు సోదరులును మిగుల ఖిన్నులైరి.

ప్రతియేఁడును జనవరిలోనే ప్రథమశాస్త్ర పరీక్షాఫలితములు తెలియుచుండెను. స్నేహితుఁడు కాంతయ్యగా రిపుడు తమ పట్టపరీక్షార్థమై చెన్నపురికిఁ బోయియుండిరి. ముందుగనే నాసంగతి తెలియఁబఱతు నని యాయన నన్ను నమ్మించినను, అట్లు జరుగనందున నాయలజడి హెచ్చెను. మద్రాసులో పరీక్షాపర్యవసానము ప్రచురమయ్యె నని విని నేను రెండవ ఫిబ్రవరిని రిజిష్ట్రారునకు తంతి నంపితిని. జవాబు లేదు ! మఱునాఁడు నే నింట వ్రాసికొనుచుండఁగా, వెంకటరత్నము వచ్చి నా విజయవార్త వెలుఁగెత్తి చెప్పెను. ఆనాఁడెల్లనూ యానందమునకు మేర లేకుండెను ! మిత్రులు పరిచితులును నన్నభినందనములలో ముంచివైచిరి ! కనకరాజు గంగరాజు లపజయ మందుటవలన నాముఖ మంత తేటగ లేకుండెను.

రాజమంద్రి కళాశాలలో నేను జేరి పట్టపరీక్షకుఁ జదువవలె నని మా తలిదండ్రులయుద్దేశము. కాని, నే నొకసంవత్సరము విద్య విరమించినచో, నేత్రదృష్టియు దేహారోగ్యమును చక్కపడు నని వెంకటరావు మున్నగు మిత్రుల యభిప్రాయము. రాజమంద్రిలోనె చదువుటకును, రాఁబోవు వేసవిలో చెన్నపురి పోయి నేత్రవైద్యము చేయిం