పుట:2015.373190.Athma-Charitramu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26. పరీక్షాపూర్వదినములు 109

మిత్రులతో సంభాషణలు సలుపుచునుంటినో యని నా కాశ్చర్యము గలుగుచున్నది !

ఒకానొకనాఁడు ఆత్మపరిశోధనసమయమున నే నిట్లు తలపోసితిని : -

"పరాత్పరా ! సాహసమున ని న్నీరీతిని సంప్రశ్నించుచున్నందుకు నన్ను మన్నింపుము. ఇంత దుర్బలశరీరముతో పాటు నా కిట్టి యున్నతాశయము లిచ్చుటయందు నీయుద్దేశ మేమి? ఈశరీర మనతి కాలములోనే కృశించి నశించిపోవనున్నది. ప్రబలమేధాశక్తికిఁ గాకున్న నపార పరోపకార చింతనమునకుఁ దావలమగు నామనస్సు, దుర్బలశరీరమున కిట్లు బంధింపఁబడి యేమిచేయఁగలదు ? పాపమను పెనురక్కసిచే నావహింపఁబడిన యీహృదయమున కేల యిట్టి పరహితైకబుద్ధియు పరార్థప్రాపకత్వమును ? అకాలమరణమే నీ వాసన్నము చేయ నుద్యమించినచో, వెనువెంటనే నా కది ప్రసాదింపక, జా గేల చెసెదవు?"

ఆసమయమున వీరేశలింగముగారికిని ఏలూరి లక్ష్మీనరసింహము గారికిని జరిగెడి యభియోగముల విచారణ మగుచుండెను. విద్యార్థులమగు మేము తీఱిక సమయములం దావివాదవిషయములు వినుటకు న్యాయసభల కేగుచుండెడివారము. మాలోఁ గొందఱు వాదిపక్షమును, కొందఱు ప్రతివాదిపక్షమును గైకొనుచుండువారు !

13 వ అక్టోబరున గంగరాజు నేనును షికారుపోయి సంస్కారములనుగుఱించి మాటాడుకొంటిమి. తన భవిష్యత్తునుగుఱించి చెప్పుచు నతఁడు, విద్యాపరిపూర్తి యైనపిమ్మట తాను న్యాయవాదియై, దురాచారములు నిరసించి, సంస్కరణపక్ష మవలంబించి, సత్యమతమును