పుట:2015.373190.Athma-Charitramu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 96

విచార మున్నట్లు కానఁబడెను. ఆరహస్యము తెలిపితివేని, నీ యభీష్టము నెరవేర్చి, బాధ తొలఁగించెదను. నిజము చెప్పు, నీ హృదయము పరపురుషునిమీఁద..............."

కమల దాని నోరణఁచునట్టుగ నిట్లు ప్రత్యుత్తర మిచ్చెను: "తల్లీ! నీవు నా హృదయశల్యమును పెకలింప పాల్పడినందుకు సంతోషమె. కాని, యటుచేయుట కదను తప్పినది. రానున్నది నాకుఁ దెలిసియె యున్నది. ఇంక మన మిచట మసలఁగూడదు. అదిగో పురోహితుఁడు నారాక కెదురుచూచుచున్నాఁడు. నన్నుఁ గొనిపోవుట కిదిగో మాయమ్మ వచ్చుచున్నది !" అనిపలికి, దానిచేత నొక్కింత రాలిచి పొమ్మనెను. ఆ సుశీలమీఁది జాలిచే కంట నీరు గ్రమ్మి, యెఱుకత వెడలిపోయెను.

(3)

మఱునాఁడు వసంతపురమున కమల యకాలమరణమునకు విలపింపని మనుజులు లేరు. "ఏమి యీ సౌభాగ్యలక్ష్మికి శుభదినమె తుదిదిన మయ్యెనే !" యని కొందఱును, "పూవు పుట్టఁగనే పురుగు నోటవేసికొనెనే!" యని కొందఱును, కమల మృతినిగూర్చి చెప్పుకొనసాగిరి. "మానవజన్మము బుద్బుదప్రాయముగదా !" యని ప్రజలు వైరాగ్యవచనములు చెప్పుకొనిరి.

కమల యవసానకాలమున గుఱించి పెండ్లికుమారుఁ డిట్లు చెప్పెను : - "నిన్న రాత్రి తలుపు మూయఁగనే, కమల శయ్యయొద్ద నిలిచి, నన్నుద్దేశించి 'అయ్యా! నన్ను విధి తఱుముకొని వచ్చు చున్నది ! కాని నేను త్వరితముగ మీతో కొన్నిమాటలు చెప్పవలెను. వివాహ బంధమువలన మన మిద్దఱము భార్యాభర్తల మైతిమని లోక