పుట:2015.373190.Athma-Charitramu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 94

శ్రావ్యనాదములతో జనలోకమునకు స్వాగతగీతము లర్పించుచున్నది. జగమెల్లయు నరుణోదయచ్ఛాయల నలరుచు, ఆనందవీచికల నోల లాడుచుండెను.

కమల నిషేకముహూర్త మీదినముననె జరుగవలసియున్నది. నీలాలకములు గప్పిన సుందరవదనమును వంచి, చెట్టుక్రిందఁ గూర్చుండి, తనయశ్రుజలముతోఁ జెంతప్రవహించు చిన్న కాలువ పొంగునట్టుగ, దైన్యమున విలపించెడి యీసుందరి యెవరు ? లోకమెల్ల నానందమున నోలలాడెడి యీసుఖసమయమున నీకోమలి యిట్లు కుందుటకుఁ గారణ మేమి ? సమీపమున నాసీనుఁడగు నీయువకుఁ డెవడు ? వారు ప్రేయసీప్రియులవలెఁ గానిపించు చున్నారు. అంత తనదు:ఖ మొకింత త్రోసివైచి యాతరుణి, "జీవితేశ్వరుఁడవగు మనోహరా ! నేఁటితో మనస్నేహవృక్షమున కాయువు చెల్లి పోయెనుగదా !" యని పలికి, హృదయము శోకపరవశము కాఁగా, మౌనముద్ర నూనియుండెను.

మనోహర మా మానిని నిటు లోదార్చెను : "కమలా, ప్రాణ సఖీ ! ఏల నీవు విచారమునఁ బ్రుంగుచున్నావు ? నీసంతుష్టవదన సందర్శనమును, నిష్కల్మషహృదయసూచకము లగు లోచనవిలోకనమును గనుల పండువుగఁ జేకొనినమిత్రు నేల దు:ఖాతిరేకమున నెత నొందించెదవు? ఓహో, జ్ఞాపకము వచ్చినది ! మన ప్రేమసఖ్యముల కీనాఁడు ప్రబలవిరోధిగ పరిణమించిన ప్రపంచమునుజూచి యిన్నాళ్లు నెట్లు భ్రమపడితిమి !" అని పలుకుచు మనోహరము, ప్రేయసిని దు:ఖానలమునుండి తొలఁగింపఁబూని తానే సంతాపమున కుమిలి పోయెను !