పుట:2015.373190.Athma-Charitramu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18. నూతనదృక్పథము 69

4. నిరర్థకవిషయములనుగుఱించి కాలము వ్యర్థ పుచ్చఁగూడదు.

5. ఏపరిస్థితులందును పరనింద చేయరాదు.

6. మంచిసంగతి నైనను, అధిక వ్యామోహమునఁ జింతింపరాదు.

  • * * *

10. పరీక్షలో నఖండవిజయమున కైన నారోగ్యముఁ గోలుపోవరాదు.

11. ఈవిధులను జెల్లించుచు, దుస్సహవాసములు, దుస్సంకల్పములు, దృష్టదృశ్యములు - వీనిని త్యజింపవలయును."

మతములలో నెల్ల నాకు బ్రాహ్మధర్మము రుచిరముగ నుండెను. బ్రాహ్మసమాజశాఖలు మూఁడింటిలో నాకు సాధారణ బ్రాహ్మసమాజము ప్రియతమ మయ్యెను. నే నిపుడు కళాశాలలోఁ జదువు ప్రాచీనగ్రీసుచరిత్రములోఁ గన్పట్టెడి రెండు రాజకీయపక్షములలోను, ప్రజాయత్తపరిపాలనాపక్షమే నా కిష్ట మయ్యెను. ప్రభు పక్షమువారగు స్పార్టనులు నా కాజన్మశత్రువు లనియు, ప్రజాస్వామిక పరిపాలకులగు అథీనియనులు పరమమిత్రు లనియు నే నెంచువాఁడను. అదేరీతిని, ఆంగ్లేయరాజ్యతంత్రమునఁగల పూర్వాచారపరులు సంస్కారప్రియులును వరుసగా నాకు శత్రుమిత్రకోటిలోనివారైరి ! ఏతత్కారణముననే నేను హిందూసంఘమునఁగల పూర్వాచారపరులను నిరసించుచు, సంస్కర్త లనిన సంతసించువాఁడను. ఆంధ్ర దేశమున నాకు నచ్చిన సంస్కర్త మాగురూ త్తములగు వీరేశలింగము పంతులే. ఆయన సంస్కారప్రియత్వము, ఒకసాంఘికపథముననే గాక, మతరాజకీయాదివిషయములకును వ్యాపించియుండెను. కావున నే నాయన నత్యంతగౌరవమునఁ జూచుచుండెడివాఁడను.