పుట:2015.372412.Taataa-Charitramu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15. జలవిద్యుచ్ఛక్తిశాల.

రాట్టము, చేతిమగ్గము చేతిమరలు మున్నగు చిన్న యంత్రములను చేతితోనే త్రిప్పి నడుపవచ్చును; కాని పెద్ద యంత్రముల నడుపుటకింకను చాల బలీయమగు చోదకశక్తి కావలెను. 'ఇంజను'లనబడు ఆవిరియంత్రము లట్టిచోదకశక్తి నిచ్చును. ఆయింజనులందు నీరు సలసలకాగి యావిరియై, అందలి ఉక్కు కమ్ములను త్రోయును. ఆశక్తిమూలమున వానికి చేర్చిన చక్రము లతివేగముగ తిరుగును. ఇట్లు ఇంజనులు రైళ్ళను మిల్లులను నడుపుట చూచుచున్నాము; ఈఇంజనులం దావిరి కల్గుటకై, అత్యుష్ణతనిచ్చు నిప్పుకావలెను; ఇందుకు నేలబొగ్గును వాడుదురు. (కర్రనిప్పు, పెద్దయంత్రములం దంత యుష్ణత నిచ్చుటకు చాలదు.)

బొంబాయినగర ప్రాంతమున చాల దూదిమిల్లులు క్రమముగా వృద్ధియాయెను. ఆమిల్లుల ఇంజనులకు వలసినంత నేలబొగ్గు సప్లైచేయుట కట్టిగను లాప్రాంతమున లేవు. వంగ విహారాది దూరప్రాంతములనుండి బొగ్గును రైలుపై తేవలెను. ఆరైలుకంపెనీవా రా బలువుసామాను తెచ్చుటకు చాల హెచ్చురేటు బాడుగ వసూలుచేయుదురు. అందువలన బొంబాయిలో బొగ్గుకు కిమ్మతు చాలహెచ్చి, మిల్లులపని గిట్టుబాటు గాక, నష్టముకలుగుచుండెను. మరియు కొన్నిగనుల నేలబొగ్గుకు ఖర్చు అధికమై, సరుకు చాలనప్పుడును గిరాకి కలుగును. ఇంగ్లం