పుట:2015.372412.Taataa-Charitramu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యీలద్వారా మంచినీ రందింపబడుచున్నది. తాతావారి యంత్రశాలలందే చాల విద్యుచ్ఛక్తియు బొగ్గుసారమగు 'కోల్‌గాను' అను, వాయువును పుట్టింపబడును. వానితో నానగరమంతటను ప్రదీపములబెట్టిరి. అన్ని పేటలందును, ఉచిత గ్రంథాలయములను, పఠనమందిరములను, పాఠశాలలను, కార్మికులకు రాత్రి బడులను, చక్కని వైద్యశాలలను, నెలకొల్పిరి. నీటిపారుదలకు మరుగుదొడ్లకు నవీనవిజ్ఞానపద్ధతుల ప్రకారము ప్రశస్తపద్ధతులను అమలులోనికి దెచ్చిరి.

ఆధునికపరిశ్రమలకు ప్రకృతిశాస్త్ర పరిజ్ఞాన మవసరము. నవీనావిష్కారములు కలిగినకొలదిని, నిర్మాణమున సౌకర్యపద్ధతులను లాభకరమగు సదుపాయములను అమలుబెట్టవచ్చును. ఆయంత్రశాలల కంగముగ విజ్ఞానపరిశోధనశాలలనుంచి, విద్యావంతులగు యువకులకు విజ్ఞానమును ఆధునిక శిల్పవిద్యలను నేర్చుకొనుటకు అందు ప్రత్యేకప్రోత్సాహము నిచ్చుచున్నారు; ప్రత్యేకమగు టెక్నికలు పాఠశాలలగూడ పెట్టిరి. ఈనగరపు నిర్మాణముకు దాని పారిశుధ్యభద్రతలకు ఆకంపెనీవారే బాధ్యత వహించి, వ్యయప్రయాసములకు జంకక దాని నాదర్శనగరముగ జేసిరి. ఆనగరముకై, ఆకంపెనీవా రిప్పటికి రమారమి రెండుకోట్ల రూపాయలసొమ్ము ఖర్చుజేసిరి. అందిప్పుడు సుమారు లక్షమంది జనులు వసించుచున్నారు.