Jump to content

పుట:2015.370800.Shatakasanputamu.pdf/602

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామప్రభుశతకము

651


మ.

తనభావంబునఁ దన్నుఁ జూచుచు సమస్తప్రాణిసంతానమం
దునఁ దన్నుం గనుఁగొంచు భూతములయందుం బ్రీతి రెట్టించి ప్రా
క్తనకర్మంబుల కోర్చి భావిఫలముల్ దానంటకున్నట్టి ధ
న్యు నకంపస్థితి ముక్తికాంతయగు ధీరోదాత్త రామప్రభో.

99


మ.

వరుసం జేసినపాపము ల్దలఁపఁ ద్రోవన్ రానిదుఃఖంబులౌ
మరణాయాసము దల్చుకొన్న భరియింపన్ రాని సంతాపమౌ
నరకావాసదురంతఖేదములు విన్నన్ భీతి రెట్టిల్లు నీ
పరితాపంబు హరించు బంధువుఁడ వీవా కావె రామప్రభో.

100


మ.

దయ భూతంబులయందుఁ జిత్తము భవత్పాదాబ్జయుగ్మంబుపై
భయ మంహశ్చరితంబులన్ వ్యసనముల్ బ్రహ్మైక్యవిజ్ఞానమం
ద యశోవృత్తి నసూయ సజ్జనసమూహాత్యంతసాంగత్యమున్
దయచేయంగదవయ్య వార్షికపయోదశ్యామ రామప్రభో.

101


మ.

పదము ల్పూజ యొనర్తునో కరములన్ భావించి పూజింతునో
హృదయం బర్చ యొనర్తునో భుజయుగం బేవేళ పూజింతునో