Jump to content

పుట:2015.370800.Shatakasanputamu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

నృసింహకవికృత

కృష్ణశతకము

క. శ్రీ రుక్మిణీశ కేశవ
     నారద సంగీతలోల నగధర శౌరీ
     ద్వారకనిలయ జనార్దన
     కారుణ్యముతోడ మమ్ముఁ గావుము కృష్ణా!1
క. నీవే తల్లివి తండ్రివి
     నీవే నా తోడు నీడ నీవే సఖుఁడౌ
     నీవే గురుఁడవు దైవము
     నీవే నా పతియు గతియు నిజముగఁ గృష్ణా!2
క. నారాయణ పరమేశ్వర
     ధారాధర నీలదేహ దానవవైరీ
     క్షీరాబ్ధిశయన యదుకుల
     వీరా ననుగావు కరుణ వెలయగఁ గృష్ణా!3
క. హరి యను రెండక్షరములు
     హరియించును పాతకముల నంబుజనాభా
     హరి నీ నామమహత్త్వము
     హరి హరి పొగడంగ వశమె హరి శ్రీ కృష్ణా!4
క. క్రూరాత్ముఁ డజామీళుఁడు
     నారాయణ యనుచు నాత్మనందను బిలువన్