శా - ఏం?
దా - అది కమిటీవారు ఒక పెద్దక్లాసుకి పఠనీయగ్రంథంగా నియమించారు.
శా - వారు ఏదో కొంత సారం కనబడితేగాని నియమించి ఉండరు. ఈమాటు తెలిసింది. ఆయితే, నీకెందుకూ ఈ గొడవా?
దా - నాకూ లాభం ఉంది.
శా - ఏమిటీ?
దా - ఇదివరలో నేను రొండు నవలలు రాస్తే వాటిమీద ఇల్లా కాకి వాల్లేదు. ఆపళంగా, కానున్నది కాకమానదని చెప్పేసి ఇది ఓ ఆడమనిషి పేరట అచ్చేయించాను.
శా - ఎవరావిడ?
దా - ఎక్కడా అనకండి, అలాంటి మనిషేలేదు!
280
ధర్మయ్య ఒక శాస్త్రుల్లుగారి ఇంటికి వచ్చి, చెప్పులు విడిచి దణ్ణమెట్టి కూర్చుని, చాతుల్లుగారూ ! మా అమ్మాయికి రాగిడీ సెయించాను. ఈయాల మంచిదేమో, సూడండి కాత్తంత, యెట్టుగోటానికి,
శా - ఈవేళ బుధవారం కాదూ?
ధ - చిత్తం,
శా - 'కుర్వీత బుధసోమయె?” అన్నాడు! మంచిదే,
281
ప్రైవేటుమేష్టారు - పుస్తకం చూడమ్మా, చూసి చదువు. ఇదిగో”
కుర్రాడు - “ఇదిగో”
ప్రై - “ఆవు”
కు - "ఆవుబొమ్మ.”
ప్రై - ఛీ, పుస్తకంలో ఉన్న అక్షరాలుచదువు. “ఇదిగో ఆవు”
కు - “ఇదిగో ఆవుబొమ్మ,”
ప్రై - కళ్ళుమూసుగు చదువుతాడూ! (అని కొట్టబోగా)
కు - (బిక్క మొహంతో) ఈ పుస్తకంలో ఉంటా ఆవాండీ!
282
ఒక ఉపన్యాసకుడు అన్యదేశం వెళ్ళి ఊరూరా లెక్చర్లు ఇస్తూ ఒకనాడు ఆదేశపు రాజుని కలుసుకోగా,
రాజు - వింటున్నాం! వింటున్నాం! తమరు అద్భుతంగా ఉపన్యసించడం!
ఉ - ఏదో. నాకేమి వచ్చునండి అసలూ?
రా - అయితే మీరు ఊర్నిబట్టి మాట్లాడతారా, లేకపోతే ప్రతీచోటా అవే పలుకులా?
ఉ - అవే.
రా - అల్లాయితే మీ లెక్చరు ఓ మాటు వినేసినవాడు రొండోమాటోస్తే చప్పగా ఉంటుందేమో!
ఉ - ఎంతమాత్రం ఉండదు.
రా - మీరెట్లా చెప్పగలరు?
ఉ - రొండోమాటు రాడు.
భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1
64
హాస్యవల్లరి