Jump to content

పుట:హరివంశము.pdf/568

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

520

హరివంశము

క. అగుఁగాక యట్ల చేసెదఁ, దగునింత యనంగ నేల దైవతకార్య
     ప్రగుణసమాచరణంబున, నెగడిననా కేమి వింత నేఁ డిది యెల్లన్.240
మ. నను నాదానవనాథుజన్నమునకున్ సంప్రీతిపూర్వంబుగా
     గొనిపో నుత్తమబుద్ధి తత్త్వనిధి యొక్కం డర్హుఁ డీమేరకున్
     ఘనుఁ డీదేవగురుండు గావలయు నిక్కం బేను వేపోయి నా
     పనికిం బోలినయట్లు చేసి విజయస్ఫారుండనై వచ్చెదన్.241
వ. అనియె నివ్విధంబునం గార్యనిశ్చయవిభాసి యైన యద్దేవునకు దేవతలు విజయ
     ప్రస్థానంబు సంఘటించిరి వాచస్పతియు నవ్వచోనిధికి సాహచర్యధుర్యుం డయ్యె
     నట్లు గదలి.242

వామనుఁడు బలికడకుంబోయి మూఁడడుగులు భూమి యాచించుట

సీ. చిఱుతకూఁకటి నున్న చిగురువెండ్రుకలతో మెఱసి మాఁగుడువడి [1]మెడల వ్రేల
     ముచ్చుట్టు ముడిచినముంజితోఁ గట్టిన చెలువంపుగోఁచి ముంజెఱఁగు దూఁగఁ
     గుశపవిత్రములతోఁగూడ డాపలికేలఁ దనయంతపొడ వైనదండ మమర
     నిద్దంపుతెల్లజన్నిదముదీప్తుల తోడఁ దొడరి కృష్ణాజినద్యుతు లెలర్ప
తే. దబ్బవ్రేలియుంగరము మేదావిబొట్టు, మడుఁగుపేలిక పిరిచుట్టు బెడఁగుగాఁగ
     వడుగుచందంబు దన కెడమడుగు గాకఁ, గొమరుగా నేఁగె నెలకఱ్ఱిగుజ్జువేల్పు.243
వ. ఇవ్విధంబున నరిగి సర్వకాలకుసుమఫలభరితపాదపవనాకీర్ణంబును ననేకముని
     జనాధ్యాసితసిద్ధతీర్థసముదయంబును బురాతనదివిజద్విజయజనపరంపరాపరిణత
     లక్షణోపలక్షితంబును సమంచితకాంచనమణిరచితశాలాకుడ్యకుట్టిమకుంభమండి
     తంబును మహావిభవోదారంబు నగు గంగాతీరంబునఁ బ్రవర్ధమానం బగు
     నధ్వరసంవిధానం బాలోకించి యజమానసదనంబు నేరం జని.244
క. అందు బలీంద్రుని విజితపు, రందరు ధర్మార్థకరణరక్షాచణు న
     స్పందితదానవ్రతు నర, విందనయనుఁ డెదురఁ గాంచి వెర వొప్పారన్.245
వ. ఆల్లనల్లన చేర నరిగి యాశీర్వాదం బిచ్చి మధురోదాత్తస్వరంబున నతని నుప
     లక్షించి యి ట్లనియె.246
మ. దితివంశంబు వెలుంగఁ బుట్టి కడిమిన్ దేవేంద్రు నిర్జించి యూ
     ర్జితనీతిం గలితార్థసంచయుఁడవై శిష్టప్రమోదాత్తశీ
     లత నిమ్మై బహుయజ్ఞదానతపముల్ గావించె దెవ్వారు నీ
     ప్రతి లే రీభువనత్రయంబున జగత్ప్రఖ్యాత వైరోచనీ.247
ఉ. చేయఁడే బ్రహ్మ యజ్ఞములు సేయఁడె రుద్రుఁడు సేయఁడే తగం
     దోయజనాభుఁ డర్ధపతి తోయపుఁ డిందుఁ డినుండుఁ జేయరే
     శ్రీ యిటు నీమఖంబునకుఁ జెందినచాడ్పునఁ జెంద దెందుఁ దే
     జోయుత పుణ్యలోకములు చూఱగొనం గల వీ వొకండవున్.248

  1. మ్రిళ్ల - మిళ్ల