Jump to content

పుట:హరివంశము.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 3.

297

     దాలిమి విడువక యతండు వేఱొక్క శరాసనంబునం బరాక్రమవ్యవహారంబు
     నడుపుచుండె నంత.115
క. కరి నెక్కి సత్యకుం డు, ద్ధుఁరుఁ డయి యంగాధినాథుఁ దొడరి కడిఁది తో
     మరమున వైచిన నతఁ డ, న్నరవరు నపరిమితమార్గణంబులఁ బొదెవెన్.116
వ. సత్యకునకుం దోడ్పడి చిత్రకుండును శ్వఫలుండును వంగబలంబులం జలంబు
     మిగులం గలంచి యాడి యంత నిలువక.117
క. కాళింగుని కరిఘటలం, గ్రాలి కలముఁ దూలనడఁచు ఘనపవనముల
     [1]ట్లాలంబున వాలంపఱఁ, దూలించిన దోర్విలాసదుర్దము లగుచున్.

బలరాముండు సంరంభవిజృంభితుం డై నంగాదిసైన్యంబులఁ దునుమాడుట

ఉ. అత్తఱిఁ దేరు డిగ్గి హరియగ్రజుఁ డుగ్రహలంబు దాల్చి యు
     ద్వృత్తిఁ గడంగి వంగజగతీపతి యొక్కినకుంజరంబుఁ బె
     ల్లొత్తి యుదగ్రకుంభదళనోద్ధతకేళి యొనర్పఁగా నతం
     డత్తల దాఁటి యెంతయు భయాతురుఁ డై తొలఁగంగఁ బాఱినన్.119
క. క్రమ్మఱ రథ మెక్కి బలి, ష్ఠమ్మగుచాపంబుఁ దాల్చి సంకర్షణుఁ డ
     స్త్రములు పఱగించి రణా, గ్రమ్మునఁ బలువుర వధించెఁ [2]గాశ్యులఁ గడిమిన్.120
వ. అమ్ముఖంబున మఱియు నార్వుఱు గారూశుల నూర్వురు మాగధుల గీటడం
     గించె నిట్లు మహోద్దతుం డై మాఱులేక మలసి మగధనాథుదెసకు నడిచిన.121
ఉ. రామునిఁ గాంచి మార్కొని శరత్రితయంబున నొంచె మాగధుం
     డామనుజేంద్రుఁ దీవ్రవిశిఖాష్టకవిద్ధుని జేసి యయ్యదు
     గ్రామణి రత్నమయకాంచనకేతువు ద్రుంచి వైచి యు
     ద్ధామశరాసనంబు త్రుటితంబుగఁ జేసి చెలంగి వెండియున్.122
క. తిలమాత్రశకలములుగా, నిలపైఁ దొరఁగించి రథ మనేకాస్త్రచయం
     బుల నతఁడు విగతచాపుఁడు, దళితరథుఁడు నై మహాగదాభుజుఁ డగుచున్.123
తే. అడరి యమ్ముసలాయుధు నరద మల్ప, కణములుగఁ బడ నడచి వే కదిసి యతని
     వ్రేయుటయు వ్రేటువడి నొచ్చి వివశుఁ డగుచు, నలఘుగద చేతఁ గొని యంతఁ దొలఁగ నుఱికి.124
వ. బలదేవుండు సాత్యకిరథం బెక్కె జరాసంధుండును గదాహస్తుం డై ప్రతి
     వీరులం గనుపుగొట్టుచుండె నప్పు డుభయసైన్యంబులు నొండొంటిం
     సందడి పెనఁకువఁ బెనంగునెడ రథికసముదయంబు లడరి యేసినం బిడుగుల
     వాన దందడిం బడిన పెనుగొండలపగిదిఁ బగిలియు ముఱిసియుఁ ద్రెవ్వియుం
     దొరుఁగు నవయవంబులతో నధికాతంకంబున ఘీంకారఘోరంబుగాఁ

  1. ట్లాలమున వాలుటంపఱ
  2. గాస్యులఁ