పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



క. ఆతని దేహము వెలువడి
యాతత మగుదీప్తి నంబరాంతంబున ను
ద్యోతించుచు నెగసి మహా
జ్యోతీరూపంబు వోయి సూర్యునిఁ గలసెన్. 164

ఆ.వె. ఇట్లు విక్రమార్కుఁ డీల్గిన విజయుఁ డై
శాలివాహనుండు లీలతోడఁ
బౌరు బెల్లఁ బొగడఁ బైఠాణమున మహా
రాజనంగఁ జేసె రాజ్య మచట. 165

సీ. అట నుజ్జయినిలోన నందఱు పౌరులు
నడలఁగా భూపాలు నగ్రమహిషి
యేడువకున్న కన్నెఱిఁగి మంత్రులు వచ్చి
నీవు గర్భిణి వౌటఁ జావఁ దగదు
వలదన్న నా ప్రభావతి మంత్రివరుల సం
బోధించి యీ రాజ్యమును భుజించు
నీ తగవును జెల్లె నిత్తఱిఁ గడుపులో
పాపని బుచ్చి మీపాల నిడుదుఁ
గీ. గొనుఁ డనుచు వీరపత్ని గావునఁ గడంకఁ
బొట్ట వ్రచ్చియు శిశువును బుచ్చి యిచ్చి
యగ్ని నివసించి దివి కేగి యమరసతులు
గొలువ నలరెడు నిజనాథుఁ గూడుకొనియె. 166

క. ఆ పట్టనమున మంత్రులు
నా పాపను బెంచుకొనుచు నాతని రాజ్య
శ్రీపతిఁగా నొనరించిరి
భూపాలన మాత్మబుద్ధిఁ బురికొనుచుండన్. 167