పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7)

xlix


వ్యాకరణ విశేషములు :

గోపరాజు చక్కని పాండిత్యము గలవాడని అతని ప్రయోగములు చెప్పుచున్నవి. సుప్రసిద్ధవ్యాకర్త పరవస్తు చిన్నయసూరి ఈ కావ్యము నుండి ఉదాహరణములను తన బాలవ్యాకరణమున చెప్పినాడు.

'ససేమిరా' కథలో "సేతువుఁగని జలనిధి సం, జాతధనుష్కోటిఁ బడిన సద్ద్విజహతికిం, బాతకము వాయు" అని వ్రాసెను. సామాన్యముగా దీనిని చదివినప్పుడు అర్థము సరిగా స్పురింపదు. మూలము నందలి 'సేతుం దృష్ట్వా '- అనుదానికి 'సేతువుఁగని' అని గోపరాజు అనువదించెను, 'క్త్వా'ర్థమునకు హేత్వర్థమున్నట్లు ప్రౌఢవ్యాకరణ కర్త చెప్పినాడు. కొన్ని ప్రసిద్ధ ప్రయోగములు గూడ కలవు. కాళిదాసుని కుమారసంభవము నందలి రతివిలాపమున “స్మర సంస్మృత్య న శాంతి రస్తి మే"అనుప్రయోగమున్నది. ఇందలి క్త్వార్థమునకు హేత్వర్థమునే చెప్పవలెను. అట్లే స్కాందపురాణము నందలి శ్రీ శైలఖండములో "శ్రీ శైలేశిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే" అనుచోటను హేత్వర్థమునే చెప్పవలెను. అట్లే గోపరాజు ప్రయోగమగు 'సేతువుఁగని' అను దానికిని 'సేతువును చూచిన' అని హేత్వర్థమునే చెప్పవలెను.

ఈ కావ్యమందొకచోట గుఱ్ఱముల పేర్లుగల ఒక పద్యమున్నది.

క. ఒనరించిన నీలని నడ
   గని బొల్లనిఁగత్తలానిఁ గైరని సారం
   గని జారని జన్నని నిమ
   వని మొదలుగఁ దెచ్చినిలిపె వాహకుఁ డెదురన్. (3-141)

ఈ పద్యమును చూచియే చిన్నయసూరి తన బాలవ్యాకరణమున ఆచ్చిక పరిచ్చేదమునందు “మహత్తులగు మగాదులకుం గయిరాదులకును డుఙ్ఙగు నుత్వంబుగాదు" (4) అను సూత్రమును చెప్పినట్లు తోచుచున్నది.