పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

398

సింహాసన ద్వాత్రింశిక


క.

కృత్యాకృత్యవిచారము
నిత్యోచితదాన మాత్మనియమము బుధసాం
గత్యము పరోపకారము
సత్యము వినయంబు నయము జరపఁగవలయున్.

15


ఉ.

ఈకొలఁదిం దదంగము లనేకవిధంబుల నుండు నన్నియు
న్నీకడ నొప్పుచున్న వవనీవర నావుడు విద్యలందుఁ బ్ర
త్యేకసమర్థుఁడైన నృపుఁ డిప్పటియేఁటి ఫలంబుఁ జెప్పుమా
నా కని యానతిచ్చిన మనంబున నాద్విజుఁ డుత్సహించుచున్.

16


మ.

మహిమాఖండలుఁ డంచు భూజనులు సంభావింప నీ వింపుతో
మహిఁ బాలించుచుఁ బుణ్యకృత్యముల ధర్మద్రవ్య మార్జింపఁగా
గ్రహదోషంబులు పుట్ట వట్లయిన నోరాజేంద్ర యీయేఁట దు
స్సహపాపగ్రహసంభవం బగునతిక్షామంబు వర్తిల్లెడిన్.

17


ఉ.

అక్రమ మాచరించి విను మర్కతనూజుఁడు తొల్లి యున్న యా
శుక్రునిరాశిఁ[1] దా విడుచుచు న్శకటాకృతి నున్న రోహిణీ
చక్రము దూఱి మంగళునిసద్మము చేరఁ గడంగి యేఁటిలో
వక్రగతిం జరింపఁగ నవర్షణమై చనుఁ గొన్నివర్షముల్.

18


క.

పఱిపఱి నిల పఱియలుగా
[2]నెఱిసిన వనపంక్తు లెండ నిరుపమమగు నా
వఱపునఁ బండ్రెండేడులు
కఱ విఁక నతిదుస్తరంబు గాగల దధిపా.

19


చ.

అనవుడు దీని కడ్డపడునట్టి యుపాయము గల్గెనేని నా
యను వెఱిఁగింపు మన్న వసుధామరతృప్తియె కారణంబుగా

  1. శుక్రుని డాసి
  2. నిరిసిన వనపంక్తు లెండనెడ త్రెవ్వని (నెడతప్పని)