పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184 సింహాసన ద్వాత్రింశిక

శా. పుణ్యస్త్రీకి గణింప[1] మంగళగుణంబు ల్సొమ్ములై యొప్పుఁగాఁ
బణ్యస్త్రీకి సువర్ణమౌక్తికసురూపవ్యక్తిభూషాకృతుల్
గణ్యంబౌగతి సంస్కృతంబునకు వాగ్భావంబు శబ్దంబు లా
పద్యాకారములౌఁ దెనుంగునకుఁ బ్రా ల్వళ్ళుం గడు న్వన్నియల్. 190

ఆ. పలుదెఱంగులైన పలుకులు గలిగియుఁ
బ్రాలు వళ్ళు లేని బేలుగవిత
వన్నెలెల్లఁ గూర్చి వ్రాయుచోఁ గాటుక
వన్నె లేని ప్రతిమవ్రాఁతఁబోలు. 191

క. తప్పక వళ్ళును బ్రాలును
ముప్పిరిగొనఁ దగినశబ్దములు మెఱుఁగెక్కం
జెప్పిన కవితాచాతురి
యొప్పము వెట్టిన పసిండియొఱపున మెఱయున్. 192

క. పాదముల వళ్ళుఁ బ్రాసము
లాదిమము ద్వితీయ మైసయక్షరములు త
త్పాదంబుల యతు లవి సం
పాదముగాకుండఁ దగిన వళ్ళిడవలయున్. 193

వ. ఆందు వళ్లన్నవి—స్వరవళ్ళు, వ్యంజనస్వరవళ్ళు, గూఢస్వరవ్యంజనవళ్ళు, వర్గవళ్ళు, సరసవళ్ళు, నెక్కటివళ్ళు, సంయుక్తవళ్ళు, ననుస్వారవళ్ళు, బోలికవళ్ళు, వృద్ధివళ్ళుఁ, బ్లుతవళ్ళు, నిత్యసమాసవళ్ళుఁ, బ్రాదివళ్ళుఁ నాఁ ద్రయోదశవిధంబులయ్యె నందు స్వరవ ళ్ళెట్టి వనిన. 194

క. అద్వయ మైఔలకు నౌ
నిద్వయము ఋౠలు గూడ నేఏలకు నౌ
నుద్వయ మౌ నోఓలకు
విద్వన్నుత వళ్ళు సెల్లు వీడ్వడఁ దమలోన్. 195

  1. గుణంబు