పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



సింహాసన ద్వాత్రింశిక

పీఠిక

"సింహాసన ద్వాత్రింశిక" అను ఈ కథాకావ్యమును కొరవి గోపరాజు రచించెను. ఇందు విక్రమార్కుని దివ్యసింహాసన సోపానములపై ఉన్న 32 సాలభంజికలు భోజరాజునకు చెప్పిన కథలున్నవి. ఈ కావ్యమును ఆంధ్ర సాహిత్య పరిషత్తు (కాకినాడ) వారు మొదట ద్వితీయ భాగమును 1933 లోను, ప్రథమభాగమును 1936 లోను ప్రకటించినారు. ప్రత్యంతరములు లభింపనందున అపపాఠములు చాల దొరలినవి. ముద్రిత గ్రంథములందు అధస్సూచికలలో కొన్ని పాఠము లీబడినవి. అన్నిటిని పరిశీలించి ఉన్నపాఠములలో సమంజసములని తోచిన పాఠములను గ్రహించి విపుల పీఠికతో ఈ ప్రతి ప్రకటింపబడినది. తెలుగులోని కథాకావ్యములలో నిది గణింపదగినది.

కథాకావ్యములు :- తెలుగులో కేతనకవి చంపూరూపమున 'దశకుమార చరిత్ర'ను రచించి కథాకావ్యములకు శ్రీకారము చుట్టెను. అది దండి మహాకవి సంస్కృతమున రచించిన గద్యకావ్యమున కనువాదము. తరువాత మంచన కేయూరబాహు చరిత్రను వ్రాసెను. అది రాజశేఖరుడు ప్రాకృతభాషలో రచించిన 'విద్ధ సాలభంజిక' అను 'సట్టకము' నందలి కథను గ్రహించి కొన్నిమార్పులు చేసి, మధ్య మధ్య కొన్నినీతికథలను చేర్చి వ్రాసినట్టిది. ఆ పిమ్మట జక్కన 'విక్రమార్క చరిత్రము' ఈ కోవలో మూడవది. ఇది కథాసరిత్సాగరము, బేతాళ పంచవింశతి, సంస్కృత విక్రమార్క చరిత్రముల నుండి కథలను తీసికొని వ్రాసినట్టిది. తరువాత అనంతామాత్యుడు 'భోజరాజీయము'ను రచించెను. పిదప